ALLOWING VEHICLES ON NH-65 : భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్- విజయవాడ హైవేలో నిలిచిపోయిన వాహనాల రాకపోకలను అధికారులు ఎట్టకేలకు పునరుద్ధరించారు. సుమారు 30 గంటల తర్వాత ఎన్‌హెచ్-65పై వాహనాల రాకపోకలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద కొత్త బ్రిడ్జి మీదుగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. కానీ గరికపాడు వద్ద కొత్త బ్రిడ్జిపై వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిన విషయం విదితమే.
తాజాగా నందిగామ మండలంలో మున్నేరులోనూ వరద తగ్గడంతో పోలీసులు ఐతవరం వద్ద వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నారు. ఐతవరంలో నిలిచిన వాహనాలను పోలీసులు దగ్గరుండి ఒకటి వెంట ఒకటి పంపిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద ఏపీ నుంచి వచ్చే వాహనాలను సైతం పోలీసులు తెలంగాణలోకి అనుమతించారు. రెండో వంతెన ద్వారా వాహనాలను అనుమతిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇరు రాష్ట్రాల మధ్య భారీ ఎత్తున నిలిచిన వాహనాలు ఎట్టకేలకు ముందుకు కదిలాయి. దీంతో విజయవాడ -హైదరాబాద్ హైవే రాకపోకలకు మార్గం సుగమమైంది.
ఎన్‌హెచ్-65పై రాకపోకల లైన్ క్లియర్ : ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద జాతీయ రహదారి ఎన్‌హెచ్ 65 కోతకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం నుంచి ఏపీ-తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద వరద ప్రవాహం కొనసాగడంతో అత్యవసర పరిస్థితుల్లోనే వాహనాలను అనుమతిచ్చారు. అత్యవసరమైతేనే నల్లబండగూడెం మీదగా జగ్గయ్యపేట వరకు అనుమతి ఇచ్చిన పోలీసులు, ఆదివారం నుంచి నల్లబండగూడెం, గరికపాడు వద్దకు పంపించారు. ఇవాళ రాకపోకలు పునరుద్ధరించారు.
మరోవైపు ఆదివారం హైదరాబాద్-విజయవాడ-మధ్య కోదాడ మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. హైదరబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను దారి మళ్లించి నార్కట్‌పల్లి, నల్గొండ, మిర్యాలాగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదగా విజయవాడకు మళ్లించారు. విజయవాడ నుంచి వచ్చే వాహనాలను గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్‌పల్లి మీదగా హైదరాబాద్ మళ్లించి పంపించారు. ఇప్పుడు ఐతవరం లైన్ క్లియర్ కావడంతో వాహనాలు రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి.
'విజయవాడ-హైదరాబాద్' హైవే రాకపోకలు షురూ - AP Vehicles Allowed to Telangana