Vegetables Price Hike In Telangana Today : వేసవి కాలం రాగానే కూరగాయలు రేట్లు పెరగడం వర్షాకాలం మొదలుకాగానే అవి తగ్గటం మామూలే. కానీ ఈ సంవత్సరం అందుకు డిఫరెంట్‌గా ఉంది. ఎండాకాలంలో ధరలు అంతంత మాత్రంగానే పెరిగినా వర్షాకాలం మొదట్లో రేట్లు అమాంతం కొండెక్కాయి. ఇది సామాన్యులకు భారంగా మారింది. దాదాపు కూరగాయలన్నీ కిలో రూ.80 ఉన్నాయి. దీంతో ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదని ప్రజలు వాపోతున్నారు.
అవసరమైన మేర సప్లై రాక : కూరగాయలే అంటే ఉల్లిగడ్డ ధరలు కూడా అంతే. గతంలో కిలో రూ.20 చొప్పున దొరికేది ఇప్పుడు కిలో రూ.40 నుంచి రూ.50వరకు అమ్ముతున్నారు. కారణం మార్కెట్‌కు సరిపడా సరకు రాకపోవడమే. గతంలో హైదరాబాద్‌కు రోజూ 8వేల క్వింటాళ్ల ఉల్లిగడ్డ వస్తే ప్రస్తుతం 5వేల క్వింటాళ్ల వరకే వస్తోంది. అవసరమైన మేరకు సరకు వస్తే సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉంటాయని, లేదంటే సప్లై తగ్గినప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ధరలు కూడా పెరిగే అవకాశముంటుందని చెబుతున్నారు.
"కూరగాయల ధరల పెరగడంతో మాపై భారం పడుతోంది. ధరలు తగ్గించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలను అమలు చేయాలి. పెరుగుదలను అంచనా వేసి ఆ మేరకు నిల్వలను అందుబాటులోకి తీసుకురావాలి." - సీహెచ్ రాము, వినియోగదారుడు
సగానికంటే తక్కువగా ఉత్పత్తి : తెలంగాణ జనాభా అవసరాన్ని బట్టి ప్రతి సంవత్సరం 38.54 లక్షల టన్నుల కూరగాయలు అవసరం కాగా ప్రస్తుతం 19.54 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. దాదాపు సగం ఉత్పత్తి తగ్గిపోయింది. రాష్ట్రంలో 1.30 కోట్లకు పైగా ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతున్నాయి. అందులో కూరగాయల పంటలు 3.11లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. ఈ కారణంగా జనాభా అవసరాలను సుమారు 19లక్షల టన్నుల దిగుబడుల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది.
ఈ కారణాల వల్ల కూరగాయల రేట్లల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
హైదరాబాద్‌లో కూరగాయల ధరలు (గురువారం రోజున) | ||
(కిలో రూపాయలల్లో) | ||
కూరగాయ | రైతు బజార్ | బహిరంగ మార్కెట్ |
టమాటా | 41 | 50 |
ఉల్లి | 35 | 40 |
వంకాయ | 23 | 40 |
బెండకాయ | 50 | 60 |
పచ్చిమిర్చి | 65 | 80 |
బీరకాయ | 65 | 80 |
దొండ | 28 | 40 |
గోరుచిక్కుడు | 45 | 60 |
చిక్కుడు | 50 | 70 |
బీన్స్ | 115 | 120 |
Vegetables Price in Hyderabad Today : ఈసారి వేసవిలో స్థానికంగా కూరగాయల ఉత్పత్తి 20 శాతం వరకు తగ్గింది. డిమాండ్‌ను బట్టి ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నారు. అందుకే మే వరకు ధరలు దాదాపు అదుపులోనే ఉన్నాయి. ఈ నెల మొదటి వారంలో వర్షాలు మొదలయ్యాక సమస్యలు ప్రారంభమయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సమయంలో వర్షాలు పడడం వల్ల అవి తడిసి పోవడం, కుళ్లిపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. హైదరాబాద్ మహానగర జనాభాకు నిత్యం దాదాపు 3,300 టన్నుల కూరగాయలను అవరసం ఉంటుంది కానీ వారం రోజులుగా అన్ని హోల్‌సేల్ మార్కెట్లకు 2,800 టన్నుల సరకు మాత్రమే వస్తుంది.
"కూరగాయల ధరలు పెరగడంతో మాకు కూడా నష్టం వస్తోంది. బీన్స్, క్యారట్ వంటివాటిని ఎవరూ కొనడం లేదు. దీంతో అవి కుళ్లిపోతున్నాయి. ఆకుకూరలు కూడా త్వరగా పాడవుతున్నాయి. మాకు పెట్టుబడులు కూడా తిరిగి రావడంలేదు." - అంజమ్మ, కూరగాయల విక్రేత
రాష్ట్రంలో నెల రోజుల కిందట బావులు, బోర్ల కింద కూరగాయల పంటలను వేశారు. ఈ నెలాఖరులకు వాటి నుంచి కొంత మేర దిగుబడులు వచ్చే అవకాశముంది. వర్షాలు మొదలు కావడంతో సీజన్ పంటను కూడా రైతులు ప్రారంభించారు. వీటి దిగుబడులు కూడ జులై, ఆగస్టు మాసాల్లో వచ్చే వీలుంది. రాష్ట్ర రైతులు వేసిన పంటల దిగుబడి మొదలైతే ధరలు తగ్గుముఖం పడతాయని మార్కెటింగ్ అధికారులు తెలిపారు.
కన్నీళ్లు తెప్పిస్తున్న కూరగాయలు - కొండెక్కి కూర్చున్న 'కోడి' - హైదరాబాద్‌లో నేటి ధరలు ఇలా!
Vegetables Price Dropped in Telangana : సామాన్యుడా ఊపిరిపీల్చుకో.. కూరగాయల ధరలు దిగొచ్చాయి