Vegetable Prices Rising in Hyderabad : రైతుల దగ్గర పంట రావటం లేదంటే చాలు మార్కెట్లలో కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. అప్పటిదాకా సాధారణ స్థాయిలో ఉన్న ధరలు ఒక్క సారిగా పెరిగి రెట్టింపు అవుతాయి. రైతు బజార్లలోనే ఇలా ఉంటే కాలనీల్లో, చిన్న దుకాణాల్లో కూరగాయలు కొనలేని పరిస్థితి ఉంటుంది. ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా 45 డిగ్రీల పైనే ఎండలు కాశాయి. ఇదే గాక మే నెలలో అకాల వర్షాలు కురిసి పంటను నాశనం చేసింది. దీంతో రావాల్సిన దిగుబడి కంటే తక్కువగా రావటంతో కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగాయి.
మొన్నటి దాకా రూ.10 కంటే తక్కువగా పలికిన టమాటా రేటు 30 రూపాయలు దాటింది. ఇక బయట మార్కెట్లో ఈ రేటు రూ.40 నుంచి రూ.50 దాకా పలుకుతోందని పచ్చి మిర్చి మాత్రం రూ.50 రూపాయల పైనే ఉందని కొనుగోలుదారులు అంటున్నారు. కూరగాయల రేట్లు పెరగడం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు కొనుగోళ్లు కష్టంగా మారాయని వాపోతున్నారు.
Vegetables Price Hike in Telangana : కూరగాయలు ధరలు తగ్గాలంటే.. ఇలా చేయాల్సిందే!
"ఇంటి దగ్గరి కంటే ఇక్కడ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. టమాటా 35, 40 రూపాయలకు అమ్ముతున్నారు. ఇదివరకంటే ఈసారి రేట్లు ఎక్కువగా పెరిగాయి. వేసవి కాలం కదా అందుకే రేట్లు పెరిగి ఉంటాయి అనుకుంటున్నాను. ఇంకా సాయంత్రం ఆ సమయంలో వస్తే కూరగాయాలు వాడిపోయి ఉంటున్నాయి." - కొనుగోలుదారులు
అవసరమైన దానికంటే తక్కువ సరుకు మార్కెట్‌కు రావడం వల్లే రేట్లు పెరుగుతాయి. ప్రస్తుత పరిస్థితి కూడా అలాంటిదే. జాతీయ పోషకాహార సంస్థ గణాంకాల ప్రకారం రోజుకు 350 గ్రాముల కూరగాయలు తినాలి. ఈ లెక్కన హైదరాబాద్ రోజుకు 3వేల 300 టన్నుల కూరగాయలు అవసరం. అన్ని హోల్‌సేల్ మార్కెట్లకు 2వేల800 టన్నులు మాత్రమే వస్తున్నాయి. అయితే కూరగాయల్లో కొన్ని రేట్లయితే విపరీతంగా పెరిగిపోయాయి.
"ఇప్పుడు వర్షాలు లేవు ఎండలు బాగా కొడుతున్నాయి. మేము కొనే దగ్గర ఒక రేటు ఉంటే మేము ఒక రేటు అమ్ముతాం. తెచ్చిన రేటుకు ఒక రూపాయి అటు ఇటు చేసుకుని అమ్ముతాం. పొద్దున తీసుకువస్తాం కూరగాయలు కానీ సాయంత్రానికి అవి వాడిపోతున్నాయి . దీంతో మాకు నష్టం వస్తుంది. ఇప్పుడు పూత, దిగుబడి తక్కువగా ఉంటుంది అందుకే రేట్లు పెరుగుతాయి. రెండు నెలలు ఇలానే ఉంటుంది. దాని తర్వాత కూరగాయల రేట్లు తగ్గిపోతాయి." - వ్యాపారులు
నెల రోజుల పాటు ఇదే పరిస్థితి : రోజూ 5 వేల క్వింటాళ్ల టమాటా వస్తే ధర కాస్త అందుబాటులో ఉంటుంది. కానీ రాక తగ్గడంతో రేట్లు పెరిగాయి. ఎండల కారణంగా ఎక్కువ రోజులు కూడా కూరగాయలు నిల్వఉండటం లేదని, మరో నెల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వారు అంటున్నారు. వర్షాకాలం ప్రారంభం అయ్యాక కూరగాయల సాగు మళ్లీ పుంజుకుంటుందనిత, ఆ తర్వాత రేట్లు తగ్గే అవకాశం ఉంటుందని రైతులు, వ్యాపారులు వెల్లడిస్తున్నారు.
Vegetables Price in Telangana : కూర'గాయాలు'.. ఇవే పరిష్కార మార్గాలు..!