Vasantha Panchami Celebrations 2024 : రాష్ట్రవ్యాప్తంగా వసంతపంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. అమ్మవారి జన్మదినం సందర్భంగా అర్చకులు పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్ఞాన సరస్వతి(Gnana Saraswati Temple) సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే ప్రయోజకులవుతారనే నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే చిన్నారులకు తల్లిండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. ఆదిలాబాద్‌లో శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో హోమాది కార్యక్రమం జరిపి అనంతరం చిన్నారులతో అక్షరాలు దిద్దించారు.
వసంత పంచమి రోజు ఈ పనులు చేస్తున్నారా? అమ్మవారి ఆగ్రహానికి గురైనట్లే!
Vasantha Panchami Telangana State Wide : వసంత పంచమిని(Vasantha Panchami) పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సరస్వతి అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భద్రకాళి రోడ్డులోని శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల పూలతో అందంగా అలంకరించి సామూహిక అక్షరాభ్యాసాన్ని చేపట్టారు. అలంపూర్ జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి అభిషేకం చేసేందుకు జలంతో నిండిన కలశాలను తలపై పెట్టుకోని ఊరేగింపుగా వచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు - బాసర ఆలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం
Vasantha Panchami Celebration at Basara : సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యాసరస్వతి ఆలయంలో వైభవంగా వసంత పంచమి వేడుకలు నిర్వహించారు. శ్రీక్షేత్రం పీఠాధిపతి మధుసూదన నందన సరస్వతీ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకం చేశారు. దుబ్బాక నియోజకవర్గంలోని సరస్వతి దేవి ఆలయంలో కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన యజ్ఞంలో పెద్ద ఎత్తున దంపతులు పాల్గొన్నారు.
మెట్‌పల్లి త్రిశక్తి ఆలయంలోని సరస్వతి దేవికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. వసంత పంచమి సందర్భంగా అంబర్‌పేటలోని మహంకాళి ఆలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సరస్వతి దేవి అమ్మవారి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అక్షరాభ్యాసం కోసం వచ్చిన భక్తులకు అసౌక్యరం కలగకుండా ఆలయాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
బాసరలో వసంత పంచమి వేడుకలు.. అక్షరాభ్యాసానికి పోటెత్తిన భక్తులు