Value of Project Undertaken By Adani In Andhra Pradesh : జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అదానీప్రదేశ్‌గా మార్చేసింది అనడంలో సందేహమే లేదు. భారీ పోర్టుల నుంచి ఇళ్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రాజెక్టు వరకు అన్నీ అదానీ పరం చేసిన ఘటన జగన్‌ది. ఐదేళ్లలో పోర్టులు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, డేటా సెంటర్లు, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులు, ఇళ్లకు స్మార్ట్ మీటర్లు చివరకు థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరా టెండర్లనూ గంపగుత్తగా అదానీ సంస్థకు కట్టబెట్టింది. జగన్ ప్రభుత్వంలో కట్టబెట్టిన ప్రాజెక్టుల విలువ రూ.2,76,333 కోట్లు.
మరో గుత్తేదారు లేరన్నట్లు అదానీకి తప్ప మరొకరికి ఆ పని సాధ్యం కాదన్నట్లుగా జగన్ సర్కార్ వ్యవహరించింది. ఆ సంస్థకు భారీ ప్రాజెక్టులను కట్టబెట్టడం వెనుకా జగన్ తన నైజాన్ని వెల్లగక్కారు. తొలుత ఆ సంస్థ ఒప్పందాలను కొనసాగించే విషయమై హైడ్రామా నడిపించి తర్వాత రూ.లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు అప్పగించారు. ఈ స్థాయిలో ప్రాజెక్టులు కట్టబెట్టడం వెనుక ఉన్న ‘జగన్ అదానీ’ రహస్య బంధంపై ఆరోపణలు వస్తున్నాయి. ప్రాజెక్టుల కేటాయింపు వెనుక ప్రభుత్వ పెద్దలకు భారీ మొత్తంలో ముడుపులు అందాయన్నది వాస్తవమేనని ఎట్టకేలకు తేలింది.
పెట్టుబడుల ప్రతిపాదన తక్కువ చేసి : జగన్ ప్రభుత్వం అధికారంలోకి ఇలా వచ్చిందో లేదో రూ.70వేల కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటుకు అప్పటి టీడీపీ ప్రభుత్వంతో అదానీ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందాన్ని కుదిస్తున్నట్లు డ్రామాకు మొదలుపెట్టింది. ‘భూములు తీసుకుని కూర్చుంటే కాదు. నిర్దిష్ట ప్రతిపాదనలతో ముందుకు రావాలి. పెట్టుబడులు ఎంత? ఎంత వ్యవధిలో ప్రాజెక్టు పూర్తిచేస్తాం? అనే దానిపై స్పష్టత ఇవ్వాలి’ అని జగన్ ప్రభుత్వం నరకం చూపించింది. దీంతో పెట్టుబడుల ప్రతిపాదనను తక్కువ చేసి రూ.14వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా జగన్ ప్రభుత్వంతో అదానీ సంస్థ కొత్తగా ఒప్పందాన్ని చేసుకుంది.
ఐదు సంవత్సరాల్లో ఇవి గుర్తుకు రాలేదు : తర్వాత కొద్దినెలల్లోనే ‘అదానీ అంటే జగన్, జగన్ అంటే అదానీ’ అన్న పేరు వినిపించిందంటే ఆ బంధాన్ని అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడులు, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అసలు ఏం సంబంధం లేకుండా రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టులను ఒక్కొక్కడి అదానీకి అప్పగించింది. డేటాసెంటర్ ఏర్పాటు కోసం విశాఖలో రెండుసార్లుగా 190.29 ఎకరాలను కేటాయించిన భూముల విలువ సుమారు రూ.3,058 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అంత విలువైన భూములు కట్టబెట్టినా ఐదేళ్లలో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి అడపాదడపా భూములు చదును చేయడం మినహా ప్రాజెక్టు పనులు వేగంగా చేపట్టలేదు. కానీ, జగన్‌కు ఐదు సంవత్సరాల్లో అదానీ సంస్థ ప్రాజెక్టును పూర్తిచేయలేదన్న విషయం గుర్తుకురాకపోవడం విశేషం.
పీఎస్‌పీ ప్రాజెక్టు అప్పగింత : ఇంధన రంగంలో పెట్టుబడులు పెడతామంటే జగన్‌కు ఇష్టమైన కంపెనీ అదానీ దరఖాస్తు చేయడమే ఆలస్యం ఇంకా పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్రాజెక్టులు వాటి ఏర్పాటుకు అవసరమైన భూముల కేటాయింపులు గత సర్కార్ వెంటనే పూర్తి చేసింది. అదానీకి మేలు చేయడానికి ఒక్కరోజులోనే సెకి ద్వారా 7వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లే, 3,700 మెగావాట్ల పీఎస్‌పీ ప్రాజెక్టులను అప్పగించింది. రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధంచి దావోస్ వెళ్లి గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కానీ ఐదు సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్టునూ అదానీ సంస్థ ప్రారంభించలేదు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణపట్నం పోర్టులో 75శాతం వాటాను 2020 అక్టోబరులో అదానీ సంస్థ చేజిక్కించుకుంది. ఈ డీల్ జరగడానికి జగన్ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందన్న ఆరోపణలు వచ్చాయి. మిగిలిన 25శాతాన్ని 2021 ఏప్రిల్ 5న రూ.2,800 కోట్లకు సొంతం చేసుకున్నట్లు అదానీ సంస్థ వెల్లడించింది. పోర్టు దక్కించుకునేందుకు మొత్తంగా చేసిన ఖర్చు రూ.13,675 కోట్లు అని అదానీ సంస్థ స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఖజానాకు రాకుండా : గంగవరం పోర్టు లిమిటెడ్ కోసం విశాఖ ఉక్కు ప్లాంటుకు చెందిన 2,800 ఎకరాల భూమిని కేటాయించింది. తర్వాత రాష్ట్రప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం ఈక్విటీని రూ.645.10 కోట్లుకు అదానీ సంస్థకు ప్రభుత్వం కట్టుబెట్టింది. ఈ మొత్తాన్ని మచిలీపట్నం, రామయపట్నం, భావనపాడు పోర్టుల అభివృద్ధికి ఈక్విటీ కింద వినియోగిస్తామని వెల్లడించింది. ఈక్విటీ విక్రయంపై ఆరుగురు ప్రభుత్వ కార్యదర్శులతో కమిటీ వేయగా వారు చేసిన సూచన మేరకు ఈక్విటీని అదానీకి విక్రయించినట్లు ప్రకటించింది. దీనివల్ల పోర్టుకు వచ్చే స్థూల ఆదాయంలో 2.1 శాతం వాటా 2039 వరకు, మరో పదేళ్లు లీజు వ్యవధి పొడిగిస్తే స్థూల ఆదాయంలో 4.2 శాతం చొప్పున ఆ తర్వాత పదేళ్లకు 8.2 చొప్పున వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు రాకుండా చేసింది.
గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు ఆర్‌డీఎస్‌ఎస్ పథకం కింద స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులను అదానీ సంస్థకు ప్రభుత్వం అప్పజెప్పింది. ఇందుకు గత సర్కార్ పిలిచిన టెండర్లకు జగన్‌కు చెందిన రెండు అస్మదీయ కంపెనీలే బిడ్లు వేయగా అందులో ఒకటి అదానీ రెండోది షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌కు దక్కింది. ఎల్1గా నిలిచిన అదానీ సంస్థకు ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం అప్పజెప్పింది.