Union Minister Bandi Sanjay On BRS : బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ చర్చలు జరుపుతుందనేది తప్పుడు వార్త అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అనేది అవుట్ డేటెడ్ పార్టీ అని, అసలు ఆ పార్టీతో చర్చలు జరపాల్సిన అవసరమే తమకు లేదన్నారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే బీఆర్ఎస్ విలీనం అని ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు.
Bandi Sanjay Fires On KTR : బీజేపీ కార్యాలయంలో మీడియాతో బండి సంజయ్ పలు అంశాలపై ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కేటీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి జైళ్లో వేస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి అందరికీ తెలుసన్నారు. తనతో సహా బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ హింసించిన, జైల్లో వేసిన తీరును ఎవరూ మర్చిపోలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకం పోయిన రోజు నుంచి కాంగ్రెస్‌తో జరగబోయేది యుద్ధమే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైనా బీజేపీ ధాటికి తట్టుకోలేనంతగా యుద్ధం చేస్తామన్నారు.
కవిత బెయిల్‌తో బీజేపీకి సంబంధం లేదు : కవిత బెయిల్‌కు, బీజేపీకి సంబంధం లేదన్నారు. సిసోదియాకు బెయిల్ వస్తే మా పార్టీకి సంబంధముందా? అని ప్రశ్నించారు. కోర్టు విషయాలను పార్టీతో ముడిపెట్డడం సరికాదన్నారు. నిజాయతీగా పని చేసే ఐఏఎస్‌లకూ నేటికీ పోస్టింగ్ ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్కు కొమ్ముకాసిన ఐఏఎస్‌లకే మళ్లీ మంచి పోస్టింగులిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ అంశంలో కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్కు తేడా లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు.
స్థానిక ఎన్నికల్లో బ్రాండ్ అంబాసిడర్లు వారే : అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని బండి సంజయ్ స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్నారు. పంచాయతీలకు నిధులిచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు కూడా ప్రోత్సాహక నిధులివ్వడం లేదన్నారు. కేంద్ర నిధులతోనే పంచాయతీలు నడుస్తున్నాయన్నారు. మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ, జడ్పీటీసీలే తమ బ్రాండ్ అంబాసిడర్లన్నారు. ఏ పార్టీ గెలిస్తే పంచాయతీలు అభివృద్ధి అవుతాయనేది గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలన్నారు.
హుందాగా వ్యవహరించాలి : పంచాయతీలకు కేంద్రమే నిధులిస్తోందని హరీశ్ రావు ఇప్పటికైనా చెప్పడం శుభపరిణామం అన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూముల కొనుగోలు దందా బాధ్యతను ఓ కాంగ్రెస్ నేతకు అప్పగించిందని ఆరోపించారు. తమ్ముడి కోసమే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లారనడం సరికాదన్నారు. రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. కాంగ్రెస్‌లో లుకలుకలు మొదలయ్యాయన్నారు.
ఇతర పార్టీలను చీల్చి లాభం పొందాలనే ఆలోచన బీజేపీకి లేదన్నారు. కాంగ్రెస్‌కు ప్రజలు ఐదేళ్ల తీర్పు ఇచ్చారని, ఐదేళ్లు అధికారాన్ని ఉంచుకుంటారా? వదులుకుంటారా? అనేది ప్రభుత్వ తీరుపై ఆధారపడి ఉందన్నారు. పాతబస్తీలో రోహింగ్యాలున్న మాట వాస్తవమే కదా? ఆనాడు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ రిబ్బన్ కటింగ్ చేశారు కదా? అని ఎద్దేవా చేశారు.
వక్ఫ్ భూములపై అసదుద్దీన్ : అసదుద్దీన్ ఒవైసీ ఎన్ని వక్ప్ బోర్డు భూములను కాపాడారో సమాధానం చెప్పాలన్నారు. ఒకచోట ఊరు ఊరంతా వక్ఫ్ బోర్డు భూములేనని చెప్పడం ఎంత వరకు న్యాయం? వాటికి సంబంధించిన భూములను ఎంత మంది పేద ముస్లింలకు ఇచ్చారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. ప్రైవేట్ భూములు కూడా చాలా చోట్ల వక్ఫ్ బోర్డులో ఉన్నాయి. పూర్తి విచారణ చేస్తే వివరాలు బయటకొస్తాయన్నారు. గతంలో వక్ఫ్ బోర్డు భూములను కాంగ్రెస్, ఎంఐఎం నేతలు చాలా చోట్ల కబ్జా చేశారని ఆరోపించారు.
త్వరలో వారికి సన్మానం చేస్తాం : వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందితే వాస్తవాలన్నీ బయటకు వస్తాయన్నారు. తాను అందరి మనిషినని కొందరు కాదనుకుంటే తానేం చేయలేనన్నారు. పార్టీకి, శాసనసభ్యులకు మధ్య గ్యాప్ ఉందనేది సరికాదన్నారు. తన పార్లమెంట్ పరిధిలో 80 శాతానికిపైగా ఓట్లు నమోదు చేయించిన పోలింగ్ బూత్ కమిటీలను త్వరలోనే సన్మానిస్తా అని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధక్ష మార్పు జాతీయ అధ్యక్షులు నడ్దా చూసుకుంటారన్నారు. ఆ విషయంలో హైకమాండ్ నిర్ణయమే తమకు శిరోధార్యం అన్నారు.
మీ తప్పు కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నిందలా? : బండి సంజయ్ - BANDI SANJAY SLAMS CONGRESS GOVT