Union Minister Bandi Sanjay Letter on Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ కల్తీ అంశం హిందువుల మనోభావాలను కలిచి వేస్తుందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నా, గతంలో పట్టించుకోలేదని పేర్కొన్నారు. లడ్డూలో జంతువుల కొవ్వును వినియోగించడం నీచమని మండిపడ్డారు. హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరిగినట్లే భావిస్తున్నానని ఆయన వివరించారు. ఈ మేరకు కేంద్రమంత్రి ఆందోళన వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.
'లడ్డూ తయారీ నెయ్యి కల్తీ చేసి క్షమించరాని నేరం చేశారు. అన్యమతస్తులకు టీటీడీ పగ్గాలు అప్పగించడం వల్లే ఈ దుస్థితి వచ్చింది. సీబీఐతో విచారణ జరిపిస్తే వాస్తవాలు నిగ్గు తేలుతాయి. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి.' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏపీ సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీల నేతలు లడ్డూ కల్తీ అంశంపై స్పందించారు.
తిరుమల ప్రసాదం కల్తీ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి : తిరుమల ప్రసాదంలో నాణ్యతపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. సీబీఐ లాంటి సంస్థలతో సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. కోట్లాది మంది భక్తులు మనోభావాలకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. కల్తీకి ఎవరు కారణమైన తీవ్ర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్సీపీ ఇంత దారుణానికి పాల్పడుతుందని అనుకోలేదు : మరోవైపు తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమతంరావు డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంత దారుణానికి వడి గడుతుందని తాను ఊహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి వాడిన వాళ్లను దేవుడు కూడా క్షమించడని శాపనార్ధాలు పెట్టారు. వెంటనే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు జోక్యం చేసుకొని సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, దేవుడికి అన్యాయం జరిగినందున ఏ పార్టీ అయినా విచారణ జరగాల్సిందేనని సూచించారు. ప్రపంచంలో ప్రఖ్యాతగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో చేప కొవ్వు, ఎద్దు కొవ్వుతో ప్రసాదం చేయడం ఏంటని ప్రశ్నించారు. తప్పు చేసింది ఎవరైనా సరే దేవుడు వారిని ఊరికే వదిలిపెట్టడని వీహెచ్ చెప్పారు.
తిరుమల లడ్డూ వివాదం - రమణ దీక్షితులు కీలక వ్యాఖ్యలు - TIRUMALA LADDU CONTROVERSY