Central Minister Bandi Sanjay Reacts on KCR Letter : విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు నియమించిన ఛైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని వైదొలగాలని, కేసీఆర్ పేర్కొనడం ముమ్మాటికీ ధిక్కరణేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కమిషన్ ఏర్పాటే తప్పయితే కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. అవినీతికి పాల్పడకపోతే కరెంట్ కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై వాస్తవాలెందుకు వివరించడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు ఒక ప్రకటనను ఆయన విడుదల చేశారు.
తెలంగాణ ఉద్యమంలో జస్టిస్ నర్సింహారెడ్డి నిజాయతీ, ధైర్యసాహసాలను ప్రశంసించిన సంగతి మర్చిపోయారా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ తప్పిదాలను ఈఆర్సీపై నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారా అని మండిపడ్డారు. తమ రాజకీయ లబ్ది కోసం ఎంతకైనా తెగించడానికి సిగ్గు అనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన తప్పులను, అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారనడానికి ఫోన్ ట్యాపింగ్ నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు.
Bandi Sanjay Fires on KCR : కోర్టు పరిధిలో ఉన్న ఫోన్ ట్యాపింగ్ అంశంపై అడ్డగోలుగా మాట్లాడి, సుప్రీంకోర్టు ద్వారా చివాట్లు తిన్న నేత కేసీఆర్ అని కేంద్రమంత్రి బండి సంజయ్ దుయ్యబట్టారు. ప్రత్యేక తెలంగాణకు అడ్డంకిగా ఉన్న శ్రీకృష్ణ కమిటీ రహస్య నివేదికను బట్టబయలు చేసేలా తీర్పు ఇచ్చిన ధైర్యశాలి జస్టిస్ నర్సింహారెడ్డిని ఆయన పేర్కొన్నారు. ఉస్మానియా వర్శిటీ వద్ద ముళ్ల కంచెలు తొలగించాలంటూ తీర్పులిచ్చి ఓయూ విద్యార్థుల పోరాటాలకు చేయూతనిచ్చిన ముద్దు బిడ్డనని కొనియాడారు.
కమిషన్ ఛైర్మన్నే అవమానిస్తూ ధిక్కరణకు పాల్పడిన కేసీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం, గొర్రెల పంపిణీపై విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వ జాప్యం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. కేసీఆర్ సహా బాధ్యులను అరెస్ట్ చేసి వాస్తవాలను ప్రజల ముందుంచి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.
అసలేం జరిగిందంటే.. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డితో కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణంలో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు అంశంలో వివరణ ఇవ్వాలని కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ 12 పేజీల లేఖను కమిషన్కు రాశారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా కమిషన్ తీరు ఉందని, విచారణ పూర్తి కాకముందే తీర్పు ప్రకటించినట్లు మాటలున్నాయన్నారు. విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించడం లేదని, కమిషన్ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని తెలిపారు. విచారణ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని జస్టిస్ నరసింహారెడ్డి విజ్ఞప్తి చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.