Road Accident in Warangal : ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొని ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కురవి మండలం శివారు తాట్యా తండా సమీపంలో జరిగింది. ఈ ఘటన రాత్రి 11 గంటలకు జరగ్గా, ఇద్దరు లారీ డ్రైవర్లు క్యాబిన్లో ఇరుక్కుపోయి మూడు గంటల పాటు నరకయాతన అనుభవించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి అతి కష్టం మీద వారిని బయటకు తీశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భూపాలపల్లి జిల్లా గోపాల్‌పూర్‌కు చెందిన ఇంచర్ల రాజు రాత్రి బొగ్గు లోడుతో పాల్వంచకు వెళుతున్నాడు. అదే సమయంలో భూపాలపల్లి జిల్లా చిట్యాలకు చెందిన ఎండీ హైదర్ పాల్వంచలో బొగ్గు లోడును దింపి బూడిదతో తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కురవి మండలం కొత్తూరు తాలూకా శివారు తాట్యాతండా సమీపానికి వచ్చేసరికి రెండు లారీలు ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో లారీల ముందు భాగమైన క్యాబిన్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. అందులో ఇద్దరు డ్రైవర్లు ఇరుక్కుపోయారు. అప్పడు అక్కడే ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న వారిద్దరినీ బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినా సరే బయటకు తీసుకురాలేకపోవడంతో జేసీబీల సహాయం తీసుకున్నారు. అయినా కష్టంగా మారింది. దీంతో చేసేదేమీ లేక వారికి తక్షణ ప్రథమ చికిత్స అందించాలని క్షతగాత్రులను అందులోనే ఉంచి 108 వాహన సిబ్బందితో సెలైన్ బాటిళ్లను ఎక్కిస్తూ ప్రథమ చికిత్స అందించారు.
మూడు గంటలు నరకయాతన : ఇలా మూడు గంటల పాటు సాగించిన పోలీసులు, చివరకు గ్యాస్ కట్టర్లతో క్యాబిన్లను కోసి వారిని బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రులను మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి వైద్యుల సూచనలతో ఇంకా మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. లారీలు ఢీకొన్న ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో రెండు లారీలను పక్కకు జరిపి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు.
లైవ్ వీడియో - బైక్‌ను ఢీకొట్టిన కారు - స్పాట్లో ఒకరు డెడ్
గుంతలో పడి గాల్లోకి ఎగిరిన కారు - మెదక్ జిల్లాలో ఏడుగురు దుర్మరణం