Two BHK House Built and Not Distributed in Secunderabad : తమ సొంతింటి కల ప్రభుత్వమే నెరుస్తుందని సంబురపడ్డారు. ఏకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అనేసరికి ఆశ్చర్యపోయారు. చకచకా పనులు పూర్తవుతుంటే ఎప్పుడు వెళ్తామా అని ఆశపడ్డారు. కానీ వారి ఆశ నెరవేరడానికి ఏళ్లుగా ఎదురు చూడాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఇదీ మెట్టుగూడ డిజిజన్ పరిధిలోని చిలకలగూడ చింతబావిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో పరిస్థితి.
అర్హులైన పేదవర్గాలకు రెండు పడక గదుల ఇళ్లను నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవర్గంలోని నాలుగు ప్రాంతాలను గుర్తించి అందులో మెట్టుగూడ డివిజన్‌లోని చింతలబావి, సీతాఫల్‌మండి డివిజన్‌లోని సుభాష్ చంద్రబోస్ నగర్‌లలో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. ఈ పథకం వచ్చిన కొత్తలో పెద్దఎత్తున ఇళ్లు కట్టి, పేదలకు ఇవ్వాలని భావించినప్పటికీ అనువైన స్థలాలు లేకపోవడంతో అడుగు ముందుకు పడలేదు. ఉన్న స్థలాల్లో స్థానికుల వరకే నిర్మించాలని నిర్ణయించారు. మొదటగా మెట్టుగూడ డివిజన్ చిలకలగూడ చింతబావిలో స్థానిక రజక సంఘానికి చెందిన దోబీఘాట్ స్థలాన్ని గుర్తించారు. సెల్లార్ ప్రాంతంలో అధునాతన పద్ధతిలో దోబీ ఘాట్ నిర్మించడంతో పాటు తొమ్మిది అంతస్తుల్లో ఇళ్లను నిర్మించి 200 కుటుంబాలకు పంపిణీ చేయాలని 2014లో నిర్మాణాన్ని ప్రారంభించారు.
ఆ 'డబుల్' ఇళ్లు ఎవరికిచ్చినట్టబ్బా.. పాలమూరులో ఇప్పుడిదే హాట్‌టాపిక్..
దిల్లీలో ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు : డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పెద్ద సంఖ్యలోనే నిర్మించి, కనీసం 10 వేల మందికి కట్టించాలని అప్పటి ఉపసభాపతి, స్థానిక ఎమ్మెల్యే టి.పద్మారావు భావించారు. ఇందుకోసం నియోజకవర్గ పరిధిలోనే ఉన్న రైల్వే స్థలాల కోసం దిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారు. లాలాపేట, ఇసుకబావి ప్రాంతంలో 10 ఎకరాలకు పైగా స్థలాన్ని గుర్తించి, దాన్ని తీసుకుని బదులుగా చర్లపల్లి దగ్గర ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలితాన్నివ్వలేదు. ఈ విషయంలో ఆలస్యం జరుగుతుండటంతో చిలకలగూడలోని చింతబావి దోబీఘాట్ వద్ద సుమారు ఎకరం స్థలం ఉండటంతో జీప్లస్ 9 అంతస్తుల నిర్మాణాలు ప్రారంభించారు. సీతాఫల్‌మండి సుభాష్‌చంద్రబోస్‌నగర్‌లో జీప్లస్ 5 అంతస్తుల్లో చేపట్టిన నిర్మాణాలు 2021 నాటికి పూర్తయ్యాయి.
పగిలిపోయిన కిటికీ అద్దాలు, పేరుకుపోయిన చెత్త : 2021 జులైలో సీతాఫల్‌మండిలోని సుభాష్‌నగర్‌లో నిర్మించిన ఇళ్లను దశలవారీగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. చింతబావిలో నిర్మించిన ఇళ్లను ఇచ్చే క్రమంలో అధికారులు సర్వే చేయగా, అందులో కొందరికి పక్కా ఇళ్లు ఉన్నాయని, మరికొందరి వివరాలు సరిగ్గా లేకపోవడంతో పంపిణీ ఆపేశారు. అర్హుల జాబితాతో పాటు మరికొందరివి కలిపి 207 మంది పేర్లు నమోదైనా, వారికి ఇప్పటివరకు ఇళ్లు ఇవ్వలేదు. నిర్మాణం పూర్తయ్యి మూడేళ్లు అయినా అవి ఖాళీగా ఉండటంలో పాడుబడిపోతున్నాయి. కిటికీల అద్దాలు పగిలిపోయాయి. సెల్లార్ ప్రాంతంలో చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోంది.
'డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీలో గత ప్రభుత్వం ఆగం చేసింది - ఇప్పటికైనా ఇప్పించండి'