TTD Announces Special Darshan for Tirupati Residents : తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి ఏర్పడిన తర్వాత భక్తుల సౌకర్యార్థం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిని క్రమంగా ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. టీటీడీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం దర్శనం కల్పించేలా చర్యలు చేపట్టింది. కాగా వర్షాల కారణంగా దర్శన టోకెన్లు మంజూరు చేసే తేదీలో స్వల్ప మార్పులు చేసింది. ఈ క్రమంలో భాగంగానే స్థానికులకు డిసెంబర్ 3వ తేదీన తిరుమల శ్రీవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంది. స్వామివారి దర్శనం కోసం స్థానికులకు టోకెన్లు పొందేలా వివిధ చోట్ల ఏర్పాటు చేసింది.
Locals from Tirupati Urban/Rural, Chandragiri, Renigunta & Tirumala must carry original Aadhaar. #TTD #SrivariDarshan #Tirumala
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) November 30, 2024
తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు తమ ఆధార్ ఒరిజినల్ కార్డును చూపించి సదరు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఈ టోకెన్లు పొందే అవకాశం కల్పించింది. అందులో భాగంగా ముందుగా డిసెంబర్ 1న ఆదివారం తిరుపతి మహతి ఆడిటోరియంలో, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఉదయం 5 గంటలకు టోకెన్లను జారీ చేయనున్నట్లు ప్రకటించినా, నిరంతరాయ వర్షాల కారణంగా ఈ తేదీని డిసెంబర్ 2కు మార్పు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
Political Speeches Ban in Tirumala : మరోవైపు కలియుగ వాసుని ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గత కొంతకాలంగా కొందరు రాజకీయ నాయకులు దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడం పరిపాటిగా మారిన విషయం తెలిసిందే. దీంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోందని భావించిన టీటీడీ, ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ బోర్డు ఇటీవల తీర్మానం చేసింది. దీన్ని తాజాగా అమలులోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెల్పింది.