Srivari Mettu Footpath Route Close Due to Flood : ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో.. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల, తిరుపతిలో భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. భక్తుల రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈఓ జె. శ్యామలరావు వెల్లడించారు. ఇంతకీ.. ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం.
భారీ వర్షాల నేపథ్యంలో.. తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జె. శ్యామలరావు విపత్తుల నిర్వహణ ప్రణాళికపై అధికారులతో బుధవారం చర్చించారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు. వర్షాల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల విభాగాలూ సమన్వయంతో పని చేయాలని, ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.
కొండ చరియలపై ప్రత్యేక నిఘా : తిరుమల ఘాట్‌రోడ్‌లోని కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. ఘాట్‌రోడ్లపై ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కొండపై విద్యుత్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ శాఖ ముందస్తు జాగ్రత్తగా జనరేటర్ల కోసం డీజిల్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఐటీ వింగ్ భక్తుల దర్శనాలు, ప్రసాదం, వసతి వంటి కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ఈవో అప్రమత్తం చేశారు.
ఘాట్ రోడ్లలో జేసీబీలు : తిరుమల, ఘాట్‌రోడ్లలో వైద్యశాఖ అంబులెన్సులను అందుబాటులో ఉంచుకొని సిబ్బందితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంజినీరింగ్ విభాగం డ్యామ్ గేట్లను పర్యవేక్షించాలని ఆదేశాలిచ్చారు. ఘాట్ రోడ్లలో జేసీబీలను సిద్ధంగా ఉంచి అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు ఇంజినీరింగ్ సిబ్బందితో సమన్వయం చేసుకొని పనిచేయాలని సూచించారు. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే అగ్నిమాపక సిబ్బంది సైతం వేగంగా స్పందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.
సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయాలి : ప్రజా సంబంధాల విభాగం వాతావరణ సమాచారం తెలుసుకుంటూ.. ఎస్వీబీసీ, సోషల్ మీడియా ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ భక్తులను అప్రమత్తం చేయాలని సూచించారు. ఇప్పటికే పాపవినాశనం, శిలా తోరణం మార్గాలను టీటీడీ మూసివేసింది. వాతావరణ పరిస్థితులను అనుసరించి, ఈ మార్గాల్లో రాకపోకలను టీటీడీ పునరుద్ధరించనుంది. ఈ నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలను అనువుగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తిరుమల ఘాట్‌రోడ్డులో విరిగిపడిన కొండచరియలు - రేణిగుంట రన్‌వేపైకి భారీగా వరద నీరు
తిరుమల వెళ్లే వారికి బిగ్ అలెర్ట్ - బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు రద్దు!