Fog Travelling Tips in Telugu : ఈ మధ్య పొగమంచు ఎన్నడూ లేని విధంగా వాహనదారులకు తీవ్ర సమస్యగా మారింది. పొగమంచు కారణంగా పలుచోట్ల వాహనాలు ప్రమాదానికి గురవుతున్నట్లు ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో జాతీయ రహదారులు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే వాహనదారులు విధిగా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
ఈసారి నవంబరు నుంచే
- ప్రతికూల వాతావరణం ఉండడం, రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘన వంటి కారణాలతో ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. డిసెంబరు, జనవరి ఈ రెండు నెలల్లో పొగమంచు ఎక్కువ ఉంటుంది. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురవడంతో గాలిలో నీటి తేమ అధికంగా ఉంది. ఈ కారణంగా నవంబరు నెల ప్రారంభం నుంచే మంచు కురుస్తోంది.
- సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణిస్తున్న ట్రక్కు, లారీ డ్రైవర్లు విభిన్న వాతావరణ పరిస్థితుల్లో వాహనాలు నడుపుతు వస్తారు. కొన్ని చోట్ల పొగమంచు దట్టంగా ఉంటుంది. అకస్మాత్తుగా మంచు కురుస్తున్న ప్రాంతంలోకి వాహనాలు ప్రవేశించినప్పుడు అదుపు తప్పే ఆస్కారాలుంటాయి.
- వాహనాల కండీషన్ పరిశీలించుకోకపోవడం కూడా ప్రమాదాలకు ఓ కారణమవుతోంది. రోడ్డుపై ఉన్న మార్జిన్లలో ఆగి ఉన్న వాహనాలను వెనుక నుంచి ఢీకొనడంతోనే అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. వాహనం ఆపినప్పుడు సరైన సంకేతాలను వాహనదారులు సక్రమంగా ఇవ్వడం లేదు.
రాత్రి ప్రయాణం అస్సలే వద్దు : చీకటి పడిన దగ్గర నుంచి ఉదయం 6 గంటల లోపు దూర ప్రయాణాలు కొనసాగించకపోవడం ఉత్తమమని, ఈ సమయంలో డ్రైవర్లకు విశ్రాంతి అవసరమని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ తప్పనిసరి అనుకుంటే రోడ్లపై కనిపించే విజన్ ఆధారంగా పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు.
ముందు జాగ్రత్తలు : ఈ శీతాకాలం ప్రయాణం తప్పనిసరైతే ద్విచక్ర వాహనాలు, కార్ల లైటింగ్ (పార్కింగ్ లైట్లు) ఉండేలా చూసుకోవాలి. ఏదైనా వాహనం 50 మీటర్ల దూరంలో ఉండగానే బ్రేక్‌ను ఉపయోగించాలి. రోడ్డుపై, మార్జిన్లలో వాహనాలు ఆగిపోతే వెంటనే కచ్చిత సంకేతాన్నిచ్చేలా రేడియం స్టిక్కర్, సూచికలు ఉపయోగించాలి. వాహనం క్యాబిన్ అద్దాన్ని లోపల, వెలుపల పొడి బట్టతో తుడవాలి. డ్రైవింగ్‌లో సుధీర్ఘ అనుభవం ఉన్నవారే తెల్లవారుజామున వాహనాలు నడపాలి.
పోలీసులు ఇలా చేస్తే : డ్రైవర్లు అర్ధరాత్రి దాటిన తర్వాత ఎక్కడో ఓచోట వాహనాన్ని ఆపేలా ఏర్పాట్లు ఉండాలి. 2, 3 గంటలకు ఒకసారి డ్రైవర్‌కు ఛాయ్ తాగేందుకు అవకాశమివ్వాలి. వాహనం నడిపే సమయంలో మాట్లాడుతూ ఉండేలా తోడు ఒకరు ఉంటే మంచిది. అర్ధరాత్రి వెళ్లే వాహనాలను ఏదో ఒకచోట ఆపి పెట్రోలింగ్ పోలీసులు తరచూ తనిఖీలు నిర్వహించాలి. గస్తీ వాహనాలపై వెళ్లే పోలీసులు పెద్ద పెద్ద శబ్దాలతో సైరన్ మోగించాలి.
అర్ధరాత్రి దాటిన తర్వాత దూరప్రాంతం వెళ్తున్న లారీ, వ్యాన్లు, బస్సు, జీపు డ్రైవర్లను ఆపి ముఖాన్ని మంచి నీటితో కడిగించి(ఫేస్‌వాష్), టీ తాగించి పంపాలి. ప్రస్తుతం కొన్నిచోట్ల జాతీయ రహదారులపై పోలీసులు ‘ఫేస్‌వాష్ అండ్ గో’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది అన్ని జాతీయ, రాష్ట్రీయ రహదారులపై నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.
పొగమంచు ఎఫెక్ట్, విశాఖలో వరుసగా ఢీకొన్న ఐదు వాహనాలు
తెలంగాణను కప్పేసిన మంచు దుప్పటి - గజగజ వణుకుతున్న ఏజెన్సీ ప్రాంతాలు