86 Trains Cancelled Under South Central Railway : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 481 రైళ్లు, 570 టీజీఎస్ఆర్టీసీ బస్సులు రద్దు అయ్యాయి. ఈ మేరకు ప్రయాణికులు పరిస్థితులను అర్థం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. అవసరం ఉంటే తప్ప ఎవరూ బయటకు రావద్దని కోరుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
వర్షాలు, వరదల కారణంగా 481 రైళ్లు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. మరో 152 రైళ్లు దారి మళ్లించామని, 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు పేర్కొంది. కాజీపేట-డోర్నకల్, డోర్నకల్-విజయవాడ, విజయవాడ-గుంటూరు, గుంటూరు-విజయవాడ, విజయవాడ-డోర్నకల్, డోర్నకల్-కాజీపేట, సికింద్రాబాద్-సిర్‌పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్-షాలిమర్ తదితర రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. కేసముద్రం, ఇంటికన్నె, తాళ్లపూసలపల్లి మార్గంలో ధ్వంసమైన రైల్వేట్రాక్‌కు శరవేగంగా మరమ్మతులు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
రైల్వేట్రాక్ మరమ్మతు పనులకు వరద ప్రవాహం ఆటకంగా మారిందని, అయినా దాదాపు 500 మంది రైల్వే సిబ్బంది, కార్మికులు పనుల్లో నిమగ్నమయ్యారని చెప్పారు. మరమ్మతు పనుల్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ పర్యవేక్షించారు. మంగళవారం ఉదయం వరకు రైళ్లు నడిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
570 ఆర్టీసీ బస్సులు రద్దు : మరోవైపు భారీ వర్షాల కారణంగా టీజీఎస్ ఆర్టీసీ పలు ప్రాంతాలకు బస్సులను రద్దు చేసింది. బస్సులు వెళ్లేందుకు దారిలేకుండా భారీగా వరదనీరు ప్రవహిస్తున్న ప్రాంతాలకు బస్సులను రద్దుచేసినట్లు అధికారులు తెలిపారు. నిన్న రాత్రి వరకు 877 బస్సులను రద్దు చేసినట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఇవాళ వర్షం కొంతమేర తగ్గడంతో మరో 307 బస్సులను పునరుద్దరించి నడుపుతున్నామని, ప్రస్తుతం 570 బస్సులను రద్దు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
నిన్న ఖమ్మం, విజయవాడ , మహబూబాబాద్ వైపుగా వెళ్లే రోడ్లన్నీ జలమయం కావడంతో బస్సు రూట్లను పూర్తిగా రద్దు చేశామన్నారు. ఇవాళ తెల్లవారుజామునుంచి ఖమ్మం రూట్లో బస్సులను నడిపిస్తున్నారు. వరద ఉధృతి తగ్గిన ప్రాంతాలకు బస్సులను యధావిధిగా నడుపుతున్నట్లు తెలిపారు.