Drunk and Drive Tests in Telangana : రాష్ట్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్కరి అజాగ్రత్త ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. కొన్నిసార్లు మనం కరెక్టుగానే వెళ్తున్నా, అవతలి వారి నిర్లక్ష్యం మన ప్రాణాలను హరిస్తోంది. అయితే ఎక్కువ కేసుల్లో ప్రమాదాలకు మద్యం మత్తే కారణం అవుతోంది. మందేసి రోడ్లపైకి వస్తున్న కొందరు వాహనదారులు, ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి వారిపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు.
రహదారి భద్రత, రోడ్డు ప్రమాద నివారణే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనదారులు పట్టుబడితే వారి చేత ఊచలు లెక్కబెట్టిస్తూ, జరిమానాలు విధిస్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 4,056 మంది ద్విచక్ర వాహనదారులు పట్టుబడ్డారు. వారిపై పోలీసులు వివిధ కోర్టుల్లో 3495 ఛార్జ్‌షీట్లు దాఖలు చేశారు. 300 మంది వాహనదారులకు ఆయా కోర్టుల్లో 1 నుంచి 10 రోజుల జైలు శిక్ష పడింది. మరో 32 మంది వాహనదారులకు రెండు రోజుల పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
సుక్క పడిందంటే ప్రతి ఒక్కడూ రైడరే.. రోడ్డెక్కి ఏ బండికో గుద్దుడు ఖాయమే.. ఏం చేసేది మరి?
అందుకోసమే వాహనదారులపై చర్యలు : పట్టుబడిన వారిలో 19 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను 2 నుంచి 6 నెలలు పాటు కోర్టు సస్పెండ్ చేసింది. పట్టుబడిన వారికి మొత్తంగా రూ.76 లక్షలకు పైగా జరిమానా విధించారు. పోలీసులు ఇలాంటి ఎన్నో చర్యలు చేపడుతున్నా మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్య మాత్రం తగ్గకపోవడం గమనార్హం. ఈ నెల 3వ తేదీన ఒక్కరోజులోనే 318 మంది వాహనదారులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డారు. ఈ నెల 12వ తేదీన మద్యం సేవించి వాహనాలు నడిపిన 65 మంది పట్టుబడగా, వారికి కోర్టు 7 రోజుల జైలు శిక్ష విధించింది. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వాహనదారులపై చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు.
రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు : సీపీ అవినాశ్ మహంతి