Famous waterfalls in Telangana : పక్షుల కిలకిలలు, పచ్చటి చెట్ల నడుమ ప్రకృతికి మరింత శోభ తెచ్చే జలపాతాల పర్యటనలు ప్రారంభమయ్యాయి. ఈ మధురానుభూతుల్ని అందుకోవడానికి ఈ దసరా సెలవుల్లో ఎక్కడెక్కడికో వెళ్లక్కర్లేదు. మన రాష్ట్రంలో ఉన్న వాటర్ ఫాల్స్ టూర్ వేస్తే చాలు! అవేంటంటే
పాల నురగల బొగత : ప్రకృతిని ఆస్వాదిస్తూ పాల నురగల నీటిధారల్ని కళ్లు విప్పార్చుకుని చూస్తూ పచ్చటి చెట్ల నడుమ విహరించాలనుకుంటే బొగత జలపాతానికి వెళ్లాల్సిందే. ములుగు జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లిలో ఈ జలపాతం ఉంది. తెలంగాణ నయాగరగా పిలుచుకునే బొగత జలపాతం- వానకాలంలో పర్యాటకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి వెంకటాపురం మండలంలోని పామునూరు దగ్గరున్న పెద్దవాగు- వాజేడు మండలంలోని చీకుపల్లి గ్రామం మీదుగా ప్రవహిస్తుంది.
ఆ చీకుపల్లి వాగు నీరే బొగత దగ్గర దాదాపు 50 అడుగుల ఎత్తయిన కొండల నుంచి కిందకు దూకుతుంది. 200 అడుగుల వెడల్పుతో మంత్రముగ్ధుల్ని చేసే ఈ జలపాతం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మరింత ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఈ జలపాతం చూడ్డానికి భద్రాచలం, వరంగల్ నుంచి చేరుకోవచ్చు. వరంగల్ నుంచి 132 కిలోమీటర్ల దూరం, భద్రాచలం నుంచి 127 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
అందాల కుంటాల : దట్టమైన అడవిలో వంకర్లు తిరిగే ఘాట్ రోడ్లలో ప్రయాణించి వందలాది మెట్లు దిగితే కనిపిస్తుందా కుంటాల అద్భుతం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ పర్యటక ప్రాంతమిది. దాదాపు 150 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకే కుంటాల, తెలంగాణలోని ఎత్తయిన జలపాతాల్లో ఒకటి. వర్షాకాలం వచ్చిందంటే చాలు, పర్యాటకులు రెక్కలు కట్టుకుని ఇక్కడ వాలిపోతుంటారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి దాదాపు 62 కిలోమీటర్ల దూరంలో నేరడిగొండ మండలంలోని కుంటాల గ్రామ సమీపంలో కడెం నదిపైన అడవిలో ఉంది. ఎత్తయిన రాతి శిలల మీదుగా రెండు పాయలుగా విడిపోయే ఈ జలపాతపు మొదటి పాయ దగ్గరికే పర్యాటకులు పోతుంటారు. ఇక్కడే సోమన్నదేవుడి రాతిగుహ కూడా ఉంది. ఇక్కడ జరిపే సోమన్న జాతరకు దూరప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. పచ్చటి చెట్ల మధ్యలోని కుంటాలకు చేరుకోవడానికి 400కిపైగా మెట్లతో ఉండే దారీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. హైదరాబాద్ నుంచి 271 కిలోమీటర్ల దూరంలోని ఈ జలపాతానికి నిర్మల్ మీదుగా ఘాట్ రోడ్డుపైన చేరుకోవచ్చు.
గలగలల భీమునిపాదం : మహబూబాబాద్ జిల్లాలో పర్యాటక ప్రాంతాల్లో భీమునిపాదం జలపాతం ప్రముఖమైంది. ఇది గూడూరు మండలం సీతానాగారంలో ఉంది. ఏడాది పొడవునా కనువిందు చేసే ఈ జలపాతం, వానాకాలంలో మరింత ఉద్ధృతంగా పరవళ్లు తొక్కుతుంది. 70 అడుగుల ఎత్తు నుంచి కిందికి జాలువారే ఈ జలపాతం చరిత్ర గురించి కథలుగా చెప్పుకుంటారు. ఓ పురాణగాథ ప్రకారం, పాండవులు అరణ్య వాసం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారంట. ఆ సమయంలో ఒక కుటుంబం మంటల్లో చిక్కుకుని బిగ్గరగా కేకలు పెట్టడంతో అటుగా వెళ్తున్న భీముడు- ఈ జలపాతంలోని నీళ్లతో మంటలను ఆర్పేసి వారిని కాపాడాడని అంటారు. అందుకు నిదర్శనంగా ఇక్కడ కనబడే అతి పెద్ద పాదముద్ర భీముడిదేనని చెబుతారు. అందుకే ఈ జలపాతానికీ భీముని పాదమనే పేరు వచ్చిందంటారు. పర్యాటకులు సరదాగా గడిపేందుకు జలపాతం దగ్గర బెంచీలూ, వాచ్‌టవర్, దుస్తులు మార్చుకోడానికి ప్రత్యేకమైన గదులను ఏర్పాటుచేశారు. వరంగల్, మహబూబాబాద్ నుంచి చేరుకోవచ్చు.
ముచ్చటైన పొచ్చెర : ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ సరదాగా సాహసాలు చేయాలనుకునే వారికి పొచ్చెర జలపాతం దగ్గరకు ట్రెక్కింగ్ చేయడానికి వెళుతుంటారు. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండలానికి వెళ్లే మార్గంలో జాతీయ రహదారికి ఆరు కిలోమీటర్ల దూరంలో పొచ్చెర గ్రామ సమీపంలో ఉంది. 65 అడుగుల ఎత్తు నుంచి జాలువారే ఆకట్టుకుంటుంది. పొచ్చెర దగ్గర సినిమాలను సైతం చిత్రీకరిస్తుంటారు. హైదరాబాద్ నుంచి 260 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంటుంది.
హైదరాబాద్ టూ కాశీ - ఐఆర్సీటీసీ స్పెషల్ టూర్ - ధర కూడా అందుబాటులోనే! - IRCTC Ganga Ramayan Yatra