Tollywood Producer Sivaramakrishna Arrested : టాలీవుడ్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ మళ్లీ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ నగర శివారులో దాదాపు రూ.10 వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములకు నకిలీ పత్రాలు సృష్టించి కాజేసే ప్రయత్నం చేసిన కేసులో ఈ నెల 17న ఓయూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం అప్పీల్ చేసుకోగా, 18న మంజూరైంది. దాంతో 19వ తేదీన జైలు నుంచి బయటకు వచ్చారు.
బెయిల్ కండీషన్స్ ప్రకారం రోజూ పోలీస్‌స్టేషన్‌కు హాజరు కావాలనే నిబంధన ఉండగా, ఆయన ఉల్లంఘించారు. దాంతో శివరామకృష్ణ బెయిల్ రద్దు చేయాలంటూ ఓయూ పోలీసులు నాంపల్లిలోని నాల్గవ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు పిటిషన్ వేశారు. విచారించిన న్యాయమూర్తి, బెయిల్ రద్దు చేస్తూ ఆదేశాలివ్వగా గురువారం (ఈ నెల 24) మరోసారి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఓయూ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు : ఈ కేసుకు సంబంధించి నిందితుల అరెస్ట్, రిమాండ్ వివరాలు బయటకు రాకుండా ఓయూ పోలీసులు గోప్యత పాటించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. రిమాండ్ రిపోర్ట్ కూడా సరిగా రూపొందించలేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నగర పోలీస్ ఉన్నతాధికారులు స్పెషల్ బ్రాంచితో ఈ కేసు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే శివరామకృష్ణ బెయిల్ రద్దు కోరుతూ ఓయూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
శివరామకృష్ణ ప్రొడ్యూస్ చేసిన సినిమాలు ఇవే : వినోద్ హీరోగా తెరకెక్కిన సీతారత్నం గారి అబ్బాయి సినిమాతో బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మాతగా మారారు. ఆ తర్వాత అందరి బంధువయ, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో యువరాజు, విక్టరీ వెంకటేశ్ హీరోగా ప్రేమంటే ఇదేరా వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. రవితేజ - తాప్సీ జంటగా నటించిన దరువు సినిమా సహా హీరో నిఖిల్ యువత, నాచురల్ స్టార్ నాని రైడ్, అక్కినేని హీరో సుమ్ంత్ హీరోగా 2014లో తెరకెక్కిన ఏమో గుర్రం ఎగరావచ్చు వంటి పలు సినిమాలను ఆయన నిర్మించారు.