Centipede Found in Anna Prasadam at Tirumala : శ్రీవారి అన్న ప్రసాదంలో జెర్రి వచ్చిందన్న ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది. మాధవ నిలయంలోని అన్న ప్రసాదములో జెర్రి పడిందన్న వార్తలను కొట్టిపడేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. అన్న ప్రసాదంలో జెర్రి కనిపించిందని భక్తుడు చేసిన ఆరోపణలు నిరాధరామైనవని తేల్చి చెప్పింది. శ్రీనివాసుడి దర్శనార్థం వచ్చే వేలాదిమంది భక్తుల కోసం పెద్ద మొత్తంలో అన్నప్రసాదాలను వండుతుంటారని.. అయితే, భారీ స్థాయి వేడిలో వండే ఆహారంలో ఏమాత్రం చెక్కుచెదరకుండా ఒక జెర్రి ఉందని భక్తుడు పేర్కొనటం ఆశ్చర్యకరంగా ఉందని తెలిపింది.
ఒకవేళ పెరుగు అన్నం కలపాలంటే కూడా.. ముందుగా వేడి చేసిన అన్నాన్ని బాగా కలియపెట్టి తరువాతనే పెరుగు కలుపుతారని చెప్పింది. అలాంటి సమయంలో కూడా ఏమాత్రం రూపు చెదరకుండా జెర్రి ఉండటం అనేది నమ్మశక్యంగా లేదని వివరించింది. ఇదంతా పూర్తిగా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా మాత్రమే భావించాలని వెల్లడించింది. ఇదే సమయంలో ఇలాంటి సత్యదూర వార్తలను నమ్మకూడదని భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది టీటీడీ.
ఇటీవలె స్వామివారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీసు అధికారులు, సీబీఐ నుంచి ఇద్దరు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉండాలని చెప్పింది. స్వతంత్ర సిట్ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని తెలిపింది. కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో.. అన్నప్రసాదంలో జెర్రి పడిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రసాదాల నాణ్యతలో రాజీపడబోం: సీఎం
ప్రసాదాల నాణ్యతలో ఎక్కడా రాజీపడబోమని.. కల్తీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుమల పర్యటనలో భాగంగా శనివారం శ్రీపద్మావతి అతిథి గృహంలో తితిదే అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. ప్రస్తుతం లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారని.. ఇది ఎల్లప్పుడూ, పూర్తిగా కొనసాగించాలని సూచించారు.
సింహ వాహనంపై తిరుమల శ్రీవారు ఎందుకు విహరిస్తారో తెలుసా? - Tirumala Srivari Brahmotsavam