Online Booking Frauds : సెలవులు వస్తే చాలు చలో ఎక్కడికైనా ట్రిప్‌కు వెళ్దాం అంటుంది యువత. ఇందుకోసం ముందే స్పెషల్ ప్యాకేజీలపై ఆరా తీసీ, ప్రయాణ టికెట్లు, హోటళ్లలో గదులు వెతికి ఎక్కడ మంచి ఆఫర్స్ ఉన్నాయో మరీ చూసి బుక్ చేస్తుంటారు. ఆన్‌లైన్‌లో బుకింగ్‌ల సమయంలో నకిలీ సైట్‌ల (ఫిషింగ్ డొమైన్స్) కారణంగా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది పర్యాటక సంస్థ ఎయిర్‌బీఎన్‌బీ.
ఈ సంస్థ జూన్‌లో 5రోజుల పాటు యాత్రికులతో ఆన్‌లైన్‌లో సర్వే చేసి ఈ వివరాలను వెల్లడించింది. జీవన వ్యయం పెరగడంతో పర్యాటక ఖర్చులు తగ్గించుకునేందుకు ఆఫర్లకు ఆకర్షితులు అవుతున్నారు. అదే ఆసరాగా తీసుకుని దుండగులు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో ఆఫర్ల పేరుతో వల వేస్తు ఆమాయక ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. ఇలా సురక్షితం కాని లింక్‌లపై నొక్కి ఎక్కువ మంది మోసపోతున్నారని పేర్కొంది.
- హాలిడే బుకింగ్స్ సమయంలో సగటున రూ.1.02లక్షలు కోల్పోయినట్లు సర్వేలో పాల్గొన్న పర్యాటకులు తెలిపారు.
- నమ్మశక్యం కాని ఆఫర్లని తెలుస్తున్నా 40శాతం కంటే ఎక్కువ మంది వాటికి ఆకర్షితులై డబ్బులు ఆదా చేయడానికి యథాలాపంగా మోసపూరిత లింక్‌లపై నొక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
- యాత్రికులు పంపిన వివరాలను పరిశోధించి ప్రపంచవ్యాప్తంగా 2500 థర్డ్ పార్టీ ఫిషింగ్ డొమైన్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిపై నొక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
వచ్చే వారాంతంలో వరుస సెలవుల్లో కుటుంబంతో, స్నేహితులతో కలిసి పర్యటక ప్రదేశాలకు వెళ్లేందుకు నగరవాసులు ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలో విమాన, హోటల్, రవాణా ప్యాకేజీలను బుక్ చేసేముందు అప్రమత్తంగా ఉండాలని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటర్స్ (ఐఏఎఫ్‌సీఐ) తెలిపింది. ఇప్పటి నుంచి జనవరి వరకు యాత్రల కాలం కావడంతో పలు జాగ్రత్తలు వివరించింది.
- తెలియని వ్యక్తుల, సంస్థల నుంచి వచ్చిన మెయిల్స్, టెక్ట్ మెసేజ్‌లలోని లింకులను క్లిక్ చేయవద్దు.
- అనుమానస్పదంగా ఉన్న వెబ్‌సైట్‌లు, టెక్ట్స్‌లు, ఈమెయిల్, సోషన్ మీడియా పోస్టులపై అప్రమత్తంగా ఉండాలి.
- ఆన్‌లైన్ ఖాతాల కోసం ప్రత్యేక పాస్‌వర్డ్‌లను ఏర్పాటు చేసుకోవాలి. 12 లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలు ఉండేలా పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాలి.
- మీ అకౌంట్‌లోకి ఇతరులు ప్రవేశించడానికి ప్రయత్నించినట్లు గుర్తిస్తే వెంటనే పాస్‌వర్డ్ మార్చుకోవాలి. అలాగే టూ స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోవాలి.
- విశ్వసనీయ, ప్రభుత్వ సంస్థల వెబ్‌సైట్‌ల నుంచి టికెట్స్ వగైరా బుక్ చేసుకోవాలి.
- ఆన్‌లైన్ పేమెంట్స్ కోసం క్రెడిట్ కార్డు వాడితే బెటర్. వీటిలో రక్షణ వ్యవస్థలు మెరుగ్గా ఉంటాయి.