Another Tiger Wandering in Adilabad District : ఆదిలాబాద్ జిల్లాల్లో మహారాష్ట్ర నుంచి వస్తున్న పులులు వాటి జత కోసం అడవుల్లో సంచరిస్తున్నాయి. ప్రతి సంవత్సరం అక్టోబరు నుంచి జనవరి వరకు పెద్ద పులలు జతకట్టే సమయం కావడంతో మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా అభయారణ్యం నుంచి ఇక్కడికి వస్తుంటాయని అటవీ అధికారులు అంటున్నారు. నెల క్రితం కూడా ఓ పులి తిప్పేశ్వర్ నుంచి కిన్వట్, బోథ్ మీదుగా జిల్లాలో ప్రవేశించి స్థానిక ప్రజలను, అధికారులను భయాందోళనకు గురిచేసింది. అందర్ని కంగారు పెట్టించిన ఆ పులికి అధికారులు ఎన్-1గా నామకరణం చేయగా దీన్ని జానీగా పిలుస్తూ వచ్చారు.
ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు చాలా రోజులపాటు సుమారు 500 కిలోమీటర్లు నడిచిన ఆ పులి నార్నూర్ మీదుగా తిరిగి మహారాష్ట్రలోని తిప్వేశ్వర్ అడవుల్లోకి వెళ్లినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో మళ్లీ రెండ్రోజుల క్రితం మామడ మండలం పరిమండల్, లక్ష్మణచాంద మండలం కనకాపూర్ అటవీ ప్రాంతాల్లో పులి సంచరించినట్లు పాదముద్రలు ఉండటంతో అధికారులు, ప్రజలను ఒకింత కలవరపాటుకు గురిచేసింది. మళ్లీ జానీ వచ్చిందని అందరూ అనుకున్నప్పటికీ ఆదివారం మామడ మండలం గాయిద్‌పెల్లి గ్రామ సమీపంలో అటవీ అధికారులు పులి పాదముద్రలు గుర్తించారు. అది జానీవి కావని, ఇతర పులివి కావొచ్చని అధికారలు భావించారు.
ఎటు వైపు వెళ్లిందో : మామడ మండలం గాయిద్‌పెల్లి, జగదాంబతండా పరిసర ప్రాంతాల్లో ఉంటున్న అటవీ శాఖ అధికారులు పులి సంచరిస్తున్న విషయాన్ని తెలుసుకున్నారు. దీంతో పులి ఏ వైపు వెళ్లిందోనని దాని అడుగుల ద్వారా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 23న మామడ మండలం పరిమండల్, లక్ష్మణచాంద మండలం కనకాపూర్ పరిసర ప్రాంతాల్లో పులి అడుగులను గుర్తించిన అటవీ అధికారులు, ఆదివారం (ఈనెల 24న) గాయిద్‌పెల్లి అటవీ ప్రాంతంలో దాని అడుగులు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు.
ఈ ప్రాంతంలో ఒకే పులి ఉందా లేదా మరిన్ని వచ్చాయా ? అని తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో పులి సంచారం వాస్తవమని తేలడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అటవీ అధికారులు సైతం భవిష్యత్ కార్యాచరణ రూపకల్పణకు సిద్ధమవుతున్నారు. మామడ అటవీ రేంజీ పరిధిలో పులి ఎక్కడ ఉందో తెలుసుకునేందుకే అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
పులి ఇలా వచ్చి ఉండొచ్చు : మహారాష్ట్రలోని తడోబా అడవి నుంచి ఆసిఫాబాద్, వాంకిడి, సిర్పూర్(యు), కెరమెరి, కడెం, ఉట్నూరు, ఖానాపూర్ అటవీ ప్రాంతాల నుంచి మామడకు వచ్చి ఉండొచ్చని అటవీ అధికారులు నిర్థారణకు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ అడవుల్లో కాకుండా సంచార ప్రాంతాలకు రావడంతో ఆ పులి జాడ కోసం అధికారులు అన్వేషణ మొదలుపెట్టారు. అయితే పులుల నిర్ధారణ నిపుణులను రప్పిస్తే ఆ పులి ఎక్కడ సంచరిస్తుందో ఏ ప్రాంతంలో ఉంటుందో తెలిసే అవకాశాలున్నాయి. పులులు ఎంత దూరంలో ఉంటాయని వాటి అడుగు జాడతో గుర్తిస్తారు.
పులి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఆ పులి అడుగుల జాడలతో పసిగట్టే నిపుణులు రంగంలోకి దిగితే ఎలాంటి ప్రాణాపాయం జరగదు. ఈ దిశగా అధికారులు సైతం ఆలోచించాల్సి అవసరం ఉంది. జగదాంబతండా, మామడ మండలం గాయిద్‌పెల్లి అటవీ ప్రాంతాల్లో పులి సంచారిస్తుండడంతో అక్కడున్న స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, ఒక్కరుగా కాకుండా గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు. ఎక్కడైనా పులి కనిపించినా లేదా దాని అడుగులు కనిపించిన వెంటనే సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
ఆ పెద్దపులి మళ్లీ వచ్చేసింది! - బయటకు వెళ్లాలంటే భయపడుతున్న గ్రామస్థులు
వాహనదారుల కంటపడిన 'ఆ పెద్ద పులి' - ఇరువైపులా రోడ్లు మూసివేసిన అధికారులు