Telangana Maoists Died In Chhattisgarh Encounter : తెలంగాణ మావోయిస్టులకు ఛత్తీస్‌గఢ్‌లో మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. అబూజ్‌మడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లో పది మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. వీరిలో ఇప్పటి వరకు ఎనిమిది మందిని గుర్తించగా అందులో ముగ్గురు తెలంగాణకు చెందినవారు ఉన్నారు. వారిలో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జియ్యారం గ్రామానికి చెందిన జోగన్న అలియాస్ ఝిస్సు అలియాస్ చీమల నర్సయ్య (66), మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన వినయ్ అలియాస్ కేశబోయిన అలియాస్ రవి (55), వరంగల్‌కు చెందిన సుష్మిత అలియాస్ చైతె (26)గా గుర్తించారు. వీరు చాలా సంవత్సరాల నుంచి ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తున్నారు.
తెలంగాణ మావోయిస్టులు మృతి : స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా పనిచేస్తున్న జోగన్నపై 196 కేసులు ఉండగా ప్రభుత్వం ఆయనపై రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యుడైన రవిపై రూ.8 లక్షలు, మావోయిస్టు పార్టీ సభ్యురాలైన తిక్క సుష్మితపై రూ.2 లక్షల రివార్డు ఉంది. గత నెల 16న ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మరణించారు.
వారిలో భూపాలపల్లి జిల్లాకు చెందిన శంకర్‌రావు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆయన భార్య దాసర్వర్ సుమన అలియాస్ రజిత ఉన్నారు. 15 రోజుల వ్యవధిలో జరిగిన మరో ఎన్‌కౌంటర్లో తాజాగా ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మరణించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇప్పటికే ఉద్యమం బలహీనపడగా, ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న వారు వరుసగా ఐదుగురు మృతిచెందడంతో మావోయిస్టు పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్- 10 మంది మావోయిస్టులు హతం - Naxalites Killed In Encounter
పెద్దపల్లి జిల్లా జయ్యారం గ్రామానికి చెందిన చీమల నర్సయ్య అలియాస్ జోగన్న చిన్నతనంలో గ్రామంలో పాలేరుగా పనిచేసే వారని గ్రామస్థులు తెలిపారు. తల్లిదండ్రులు లింగయ్య, బీమరాజమ్మ చనిపోయారని, ఆయన సోదరి అంతర్గాం మండలం ఆకెనపల్లిలో ఉంటున్నారని వెల్లడించారు. నర్సయ్య గోండియా ప్రాంతంలో పనిచేస్తున్న సమయంలో దళంలోని సభ్యురాలిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ మృతుల్లో నర్సయ్య సతీమణి సైతం ఉన్నట్లు చెబుతున్నారు.
ఎన్‌కౌంటర్‌లో వినయ్ అలియాస్ రవి మృతిపై హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని ఆయన సోదరుడు వెంకటికి పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ఆయన ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లారు. తమ తండ్రి కాశవేని రాజయ్య సింగరేణిలో ఉద్యోగం చేసేవాడని దీంతో మంచిర్యాల జిల్లా బెలంపల్లిలోనే రవి పెరిగారని వెంకటి తెలిపారు.
తిక్క సుష్మిత (26) స్వస్థలం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సుబ్బయ్యపల్లి. 2016లో ఇంటర్ చదువుతున్న సమయంలోనే ఆమె మావోయిస్టు దళంలో చేరింది. రెండు రోజుల క్రితమే ఫోన్‌చేసి మాట్లాడిన సుష్మిత కనిపించక సుమారు నాలుగేళ్లు గడిచిపోయిందని తండ్రి సుధాకర్ కన్నీరు పెట్టుకున్నారు. ఓ నమ్మక ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఈ ఎన్‌కౌంటర్ చేశారని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కనకం మల్లేశం తెలిపారు.
భారీ ఎన్‌కౌంటర్- 29 మంది మావోయిస్టులు హతం - chhattisgarh encounter today