Three People Died in Cleaning Manhole : వారివి రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు. పొట్ట కూటి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంతలో వారి పట్ల విధి చిన్నచూపు చూసింది. నిర్మాణంలో ఉన్న భారీ సీవరేజీ పైపులైన్ మ్యాన్‌హోల్‌లో పనులు చేస్తుండగా విష వాయువులు, గ్యాస్‌తో ఊపిరాడక ముగ్గురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరొకరు ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ విషాద ఘటన హైదరాబాద్ కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
భాగ్యనగరంలో వర్షం భయం.. డెత్ స్పాట్లుగా మ్యాన్ హోళ్లు
Three People Died in Cleaning Manhole in Hyderabad : పోలీసులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పురానాపూల్ చౌరస్తా సమీపంలోని జియాగూడ బైపాస్ రోడ్డుపై గల ఎస్టీపీ(సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్) నుంచి కార్వాన్ మొఘల్‌కా నాలా వరకు జలమండలి ప్రాజెక్ట్ విభాగం ఆధ్వర్యంలో 900 ఎం.ఎం. డయా భారీ సీవరేజీ పైపులైన్ నిర్మాణాన్ని చేపట్టారు. దీనిని అయ్యప్ప ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీ ఆధ్వర్యంలో చేపట్టగా, నిర్మాణం దాదాపు సంవత్సర కాలంగా కొనసాగుతోంది. కొత్త పైపులైన్ నిర్మిస్తూనే దానికి స్థానిక కాలనీల సీవరేజీ లైన్‌లను అనుసంధానం చేశారు.
కొత్తవి నిర్మించారు... పాతవి అక్కడే ఉంచారు
గోనె సంచులు తీసేందుకు వెళ్లి : అయితే పైపులైన్ పొడవునా భారీ మ్యాన్‌హోళ్లనూ (Manhole) నిర్మించి వాటిలోని పైపుల్లోకి డ్రైనేజీ నీరు చేరకుండా గోనె సంచులతో పైపులను మూసివేశారు. బైపాస్ రోడ్డులోని ఎస్టీపీ సమీపంలో ఉన్న మ్యాన్‌హోల్‌లో గోనె సంచులను తొలగించేందుకు శుక్రవారం సాయంత్రం నలుగురు కూలీలు పనులు చేపట్టారు. ముగ్గురు మ్యాన్‌హోల్ లోపలికి దిగారు. మరో కూలీ బయట నిల్చొని ఉన్నారు.
ఈ క్రమంలోనే గోనె సంచులను తొలగిస్తుండగా పైపుల నుంచి విష వాయువులు వెలువడి (Release Toxic Gases) ఉక్కిరిబిక్కిరై కామారెడ్డి జిల్లా బిచ్కుందకు చెందిన హన్మంతు (40), వనపర్తి జిల్లాకు చెందిన శ్రీనివాస్ (40) స్పృహ తప్పి అందులోనే పడిపోయారు. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన వెంకట్ రాములు(50) అనే కూలీని పైన ఉన్న మరో కూలీ, స్థానికులు బయటకు లాగారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందం ఘటనా స్థలానికి చేరుకొని ఆక్సిజన్ మాస్కులు ధరించి లోపల ఉన్న ఇద్దరు కూలీలను బయటకు తీశారు.
Manhole Death Cases in Hyderabad : బాధితులను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆ ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరోవైపు ఉస్మానియాలో చికిత్స పొందుతూ వెంకట్ రాములు మృతి చెందాడు. ఈ ఘటనపై కుల్సుంపురా పోలీసులు అయ్యప్ప ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ గుత్తేదార్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ వారు చనిపోయిన విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పని నిమిత్తం వెళ్లిన వారు, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామంటూ కన్నీరుమున్నీరయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
మ్యాన్‌హోల్‌లో దిగి కార్మికుడు మృతి... మరో ఇద్దరి పరిస్థితి విషమం