Three People Died Due to Thundered in Vikarabad : రాష్ట్రంలో పిడుగుపడి ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో జరిగాయి. జిల్లాలో రెండు చోట్ల పిడుగులు పడిన ఘటనలో ముగ్గురు మరణించారు. మృతి చెందిన వారిలో ఇద్దరు యాలా మండలం జంటుపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్, లక్ష్మణప్పగా గుర్తించారు. మరొకరు ఇదే మండలంలోని బెన్నూరు గ్రామానికి చెందిన వెంకప్ప మృతి చెందారు.
అకాల వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యం : మరోవైపు అకాల వర్షం అన్నదాతలను అవస్థలు పాలు చేసింది. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని శివంపేట మండలంలోని కురిసిన వర్షానికి రైతులు అనేక అవస్థలు పడ్డారు. చిన్నగొట్టి ముక్కుల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయింది. అలాగే చెన్నాపూర్ గ్రామంలో రోడ్డుపై అరబెట్టిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో ఈరెండు గ్రామాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సికింద్రాబాద్‌లో ఉరుములతో కూడిన వర్షం : అలాగే సికింద్రాబాద్‌లోని బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, మారేడుపల్లి, చిలకలగూడ, బేగంపేట్, ప్యారడైజ్ ప్రాంతాల్లో భారీ స్థాయిలో వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఒక్కసారిగా ఈ ప్రాంతాలపై దండెత్తినట్లు పడింది. వర్షం కారణంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల వర్షం కారణంగా డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో పాదాచారులు ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు వాహనాదారులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ వర్షాలు ఇలా మరో రెండు రోజుల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముందస్తుగా వర్షాకాలం ప్రారంభం కావడంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మ్యాన్‌హోల్ వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రహదారులపై నీరు నిలిచిపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. ఇంటి నుంచి వర్షంలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ నగరవాసులకు విజ్ఞప్తి చేస్తోంది.
హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం - వాహనదారులకు తప్పని ట్రాఫిక్ తిప్పలు - Telangana Rains Report