Yellamma Kalyanam Festival in Balkampet : నేటి నుంచి బల్కంపేటలోని ఎల్లమ్మ కల్యాణోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా సోమవారం నుంచి 10వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఈ మేరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలపై, ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ పి.విశ్వ ప్రసాద్ ఒక ప్రకటనలో విడుదల చేశారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం చేయాలని సూచించారు.
నేటి నుంచి మూడు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
- గ్రీన్‌ల్యాండ్స్, అమీర్‌పేట కనకదుర్గా ఆలయం వైపు నుంచి సత్యం థియేటర్ మీదుగా ఫతేనగర్ వెళ్లే వాహనాలు బల్కంపేట మీదుగా అనుమతించరని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గ్రీన్‌ల్యాండ్స్, అమీర్‌పేట కనకదుర్గా ఆలయం నుంచి సత్యం థియేటర్ మీదుగా ఎస్సార్‌నగర్ టి-జంక్షన్ నుంచి ఎడమవైపు మలుపు తీసుకుని ఎస్సార్‌నగర్ కమ్యూనిటీహాల్ కూడలి నుంచి కుడి వైపు మలుపు తీసుకొని బీకేగూడ, శ్రీరామ్‌నగర్ ఎక్స్ రోడ్డు మీదుగా ఫతేనగర్ వైపు వెళ్లాలి.
- ఫతేనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి బల్కంపేట మీదుగా వాహనాల రాకపోకలను పోలీసులు ఆపేస్తారు. ఫతేనగర్ బ్రిడ్జి మీదుగా అమీర్‌పేట వైపు వెళ్లాల్సిన వాహనాలు బల్కంపేట - బేగంపేట లింకు రోడ్డు మీదుగా తాజ్ వివంతా హోటల్ నుండి యూటర్న్ తీసుకుని, గ్రీన్‌ల్యాండ్స్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
- గ్రీన్‌ల్యాండ్స్, బకుల్ అపార్ట్‌మెంట్స్, ఫుడ్‌వరల్డ్ వైపు నుంచి ధరంకరం రోడ్డు మీదుగా వెళ్లే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు అనుమతించరు. సోనాబాయి ఆలయం, సత్యం థియేటర్ నుంచి యూటర్న్ తీసుకొని ఎస్సార్‌నగర్ టి- జంక్షన్, ఎస్సార్‌నగర్ కమ్యూనిటీహాల్, బీకేగూడ, శ్రీరామ్‌నగర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
- బేగంపేట కట్ట మైసమ్మ దేవాలయం నుంచి లింకు రోడ్డు మీదుగా బల్కంపేటకు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు అనుమతించరు.
పార్కింగ్ స్థలాల వివరాలు వెల్లడించిన ట్రాఫిక్ పోలీసులు : ఆర్అండ్బి కార్యాలయం, నేచర్‌క్యూర్ ఆసుపత్రి, జీహెచ్‌ఎంసీ గ్రౌండ్స్, పద్మశ్రీ అపార్ట్‌మెంట్స్ నేచర్‌క్యూర్ ఆసుపత్రి రోడ్ సైడ్ వైపు, ఫతేనగర్ రైల్వే వంతెన కింద, పద్మశ్రీ అపార్ట్‌మెంట్స్ నుంచి ఆర్ అండ్ బి కార్యాలయం వైపు పార్కింగ్ స్థలాలను కేటాయించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగినా సహాయం కోసం 90102 03626కు ఫోన్ చేయవచ్చని ట్రాఫిక్ పోలీసులు ప్రకటనలో తెలిపారు.