Rain Alert in Telangana : రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది.
అదేవిధంగా ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. శుక్రవారం పశ్చిమ - మధ్య దక్షిణ బంగాళాఖాతం వద్ద ఎగువ గాలులలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ. ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం ఈరోజు పశ్చిమ -మధ్య బంగాళాఖాతంలో ఆంధ్ర ప్రదేశ్ తీరానికి చేరువగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ నుంచి 4.5 కి.మీ మధ్యలో కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోకి క్రింది స్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ, వాయువ్య దిశల నుంచి వీస్తున్నట్లు పేర్కొంది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం : రాష్ట్ర రాజధానిలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం భారీ వర్షం కురిసింది. ఉదయం ఒక్కసారిగా కురిసిన వర్షానికి ఎక్కడిక్కడ ట్రాఫిక్ స్తంభించింది. ఆఫీసులకు వెళ్లే సమయంలో వాన కురవడంతో అటు వాహనదారులు, ఇటు బాటసారులు ఇబ్బంది పడ్డారు. బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, చిలకలగూడ, మారేడుపల్లి, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, బహదూర్‌పల్లి, జగద్గిరిగుట్ట, మేడ్చల్, కిష్టాపూర్, కండ్లకోయ, దుండిగల్ తదితర చోట్ల భారీ వర్షం పడింది. రోడ్లపై వరద నీరు చేరడంతో ప్రధాన రహదారులు చిన్నపాటి చెరువులు, కాలువలను తలపించాయి.
ఐఎండీ ఎప్పటికప్పుడు వర్షాలపై అలర్ట్ చేస్తున్నా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రం ఏ క్షణం ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నట్టుండి ఆకాశం మబ్బులు కమ్ముతూ, అకస్మాత్తుగా వర్షం కుండపోతగా కురుస్తుంది. ఏదేమైనా బయటకి వెళ్లే వారు కాస్త అప్రమత్తంగా ఉండాలని అటు వాతావరణ శాఖ, ఇటు జీహెచ్ఎంసీ ప్రజలకు సూచిస్తుంది.