Tholi Ekadashi Celebrations in Telangana : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆషాఢంలో వచ్చే ఏకాదశిని తెలంగాణ ప్రజలందరూ ఏడాదిలో వచ్చే పండుగలకు ఇదే మొదటి పండుగగా జరుపుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు. తొలి ఏకాదశి రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, సకల శుభాలు కలిగించాలని ప్రార్థించారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.రెండు లక్షల రైతుల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతు కుటుంబాలన్నీ రుణ విముక్తి పొందాలని, ఏకాదశి పండుగను ప్రతి ఇంటా ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
యాదాద్రిలో లక్ష పుష్పార్చన : ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ ఆలయంలో స్వామివారికి ఘనంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేదపండితుల, వేద మంత్రోచ్ఛరణ, సన్నాయి మేళాల నడుమ ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. పూజల్లో పాల్గొన్న భక్తులకు అర్చకులు ఏకాదశి విశిష్టతను తెలియజేశారు.
వేములవాడలో తొలి ఏకాదశి పూజలు : వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి అర్చకులు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఖండ భజన కార్యక్రమాన్ని చేపట్టారు. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు . అర్చకులు ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని శ్రీ బాలాజీ ఆలయం, విఠలేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మరోవైపు తొలి ఏకాదశి పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా పలు దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు గుళ్ల బాట పట్టారు. కూకట్‌పల్లిలోని పలు ఆలయాలలో భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజుగా తొలి ఏకాదశి అనాదిగా ప్రాచుర్యంలో ఉండడంతో వైష్ణ దేవాలయాలు తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు ఉపవాస దీక్షతో తాము తీసుకొచ్చిన నైవేద్యాలను స్వామివారికి అర్పించి మొక్కలు తీర్చుకున్నారు.
పెద్దపల్లి జిల్లా తొలి ఏకాదశి దక్షిణాయన పర్వకాలం సందర్భంగా మంథని పట్టణంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబంతో కలిసి గోదావరిలో స్నానాలు ఆచరిస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పిల్లాపాపలతో కలిసి భక్తులు గోదావరి నది తీరానికి చేరుకుంటున్నారు. పట్టణంలోని శ్రీ గౌతమేశ్వర, శ్రీ భిక్షేశ్వర ఓంకారేశ్వర దేవాలయాల్లో భక్తులు తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు.
యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన పూజ - పెరిగిన భక్తుల రద్దీ - Rush at Yadadri Temple
ఆర్థిక ఇబ్బందులా? మంగళవారం నిర్జల ఏకాదశి వ్రతం చేస్తే కష్టాలన్నీ పరార్! - Nirjala Ekadashi 2024