Thefts on Interstate Highways : ఒకప్పుడు దొంగలు పట్టణాల్లో చొరబడి దొంగతనాలు చేసేవారు. ఇప్పుడు అక్కడ పోలీసుల నిఘా పెరగడంతో మాయగాళ్ల చూపు పల్లెలపై పడింది. పల్లెల్లో అయితే ఎలాంటి నిఘా ఉండదు. రెక్కీ నిర్వహించి గొలుసు దొంగతనాలు, సెల్ఫోన్లు కొట్టేయడమే వీరి స్టైల్. ముఖ్యంగా అంతర్రాష్ట్ర రహదారి చోరీలకు అడ్డాగా మారిపోయింది. ఆదిలాబాద్ నుంచి తాంసి, తలమడుగు మండలాల మీదుగా మహారాష్ట్ర మాండ్వి, నాందేడ్, మహోర్, కిన్వట్ వైపు వెళ్లే రహదారుల్లో తరచూ ఇలాంట ఘటనలు జరుగుతున్నాయి. వీరి ముఖ్య విధి ఒంటరిగా వెళ్లేవారిని టార్గెట్ చేయడమే.
ఆ రెండు వస్తువులే ముఖ్యం : ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు అంతర్రాష్ట్ర రహదారిలో బంగారం గొలుసు, సెల్ఫోన్ దొంగతనాలు పెరిగాయి. అక్కడ ఇరువైపులా ఉన్న పొన్నారి, ఖోడద్, హస్నాపూర్, సుంకిడి, రాంపూర్, ఉమ్డం, వడ్డాడి ఎక్స్ రోడ్డు, కొత్త హస్నాపూర్, కుచులాపూర్, లింగి గ్రామాల్లో దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నా అవి పని చేయడం లేదు.
దొంగతనాలు జరిగి ప్రాంతాలు :
- తాంసి మండలం హస్నాపూర్కు చెందిన మహిళ దేవరకొండ రాజమ్మ ఇటీవల అంతర్రాష్ట్ర రహదారికి దగ్గరలోని పొలంలో వ్యవసాయ పనులకు వెళ్తోంది. ఇద్దరు బైక్పై వెనుక నుంచి వచ్చి మహారాష్ట్ర మాండ్వికి ఎలా వెళ్లాలని అడిగి వెంటనే ఆమె మెడలో ఉన్న ఒకటిన్నర తులాల గొలుసును ఠక్కున లాక్కొని వెళ్లిపోయారు.
- అలాగే పొన్నారికి చెందిన యువకుడు నెల రోజుల కిందట ఆదిలాబాద్ వెళ్లేందుకు రోడ్డు పక్కన నిలబడి ఉన్నాడు. ఇంతలోనే ఇద్దరు బైక్పై వచ్చి తమ ఫోన్ పని చేయడం లేదని కాల్ చేయాలి ఫోన్ ఇవ్వాలని అడిగారు. ఆ యువకుడు ఫోన్ ఇస్తే పట్టుకొని ఉడాయించారు. ఆ ఫోన్ ఖరీదు రూ.30 వేలు ఉంటుందని వాపోయాడు.
- తలమడుగు మండలం సుంకిడికి చెందిన మరో మహిళ ఇటీవ విధులు ముగించుకొని సాయంత్రం మహారాష్ట్ర మాండ్వి, కిన్వట్, నాందేడ్ వైపు వెళ్లే రహదారి పక్క నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళుతోంది. ఇంతలో ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసును దోచుకుపోయారు.
వారి టార్గెట్ ఒంటరి మహిళలే : ముఖ్యంగా గొలుసు దొంగతనాలు ఒంటరి మహిళలనే లక్ష్యంగా చేసుకొని సాగుతున్నాయి. ఎందుకంటే మహిళలైతే వారిని అడ్డుకోలేరు. ఒకవేళ మహిళలు తిరగబడిన సులభంగా వారి నుంచి తప్పించుకోగలరు. దొంగతననాలు చేసే దొంగలు ముందుగా రెక్కీ నిర్వహించి, ఎవరూ లేరని తెలుసుకొని, అనువుగా ఉన్న సమయంలో చోరీ చేయడం, ఆపై అక్కడి నుంచి బంగారు గొలుసులు, సెల్ఫోన్లతో ఉడాయించడం చేస్తున్నారు. ఇంకో విషయం వీరు ఉపయోగించే బైకులకు నంబరు ప్లేట్లు ఉండవన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. మహిళలు రహదారిలో ఒంటరిగా వెళ్లడానికే భయపడుతున్నారు. పోలీసులు దృష్టి సారించి దొంగల నుంచి విముక్తి కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే - డైరెక్టుగా డోర్ డెలివరీ! - హైదరాబాద్లో పెరుగుతోన్న డ్రగ్స్ కల్చర్