SC Express Impatience on TG Govt : న్యాయస్థానాల విచారణలో ఉన్న క్రిమినల్ కేసుల సమాచారాన్ని ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. న్యాయవాదులు, పోలీసు అధికారుల మధ్య ఉన్న సమన్వయలోపాన్ని వెంటనే సరిదిద్దుకోవాలని రాష్ట్ర డీజీపీ జితేందర్‌ను ఆదేశించింది. సూర్యాపేట డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ వట్టె జానయ్య కేసులో దాఖలైన ఛార్జిషీట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి పూర్తి వివరాలు అందించడంలో విఫలమైన అధికారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
వీటన్నిటిపై నాలుగు వారాలలోపు అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. వట్టె జానయ్యపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నమోదు అయిన కేసుల్లో ఎప్పుడెప్పుడు ఛార్జిషీట్లు దాఖలయ్యాయన్న సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పలేకపోడంతో జస్టిస్ ఎస్‌వీఎన్‌భట్టి, జస్టిస్ హృషీకేశ్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఆశ్చర్యానికి గురై, ఈ నెల 1న డీజీపీని తమ ముందు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది.
దీంతో శుక్రవారం నాడు డీజీపీ జితేందర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం ముందు హాజరుకాగా, ఆయనపై జడ్జీలు ప్రశ్నల వర్షం కురిపించారు. నమోదు చేసిన ‘కేసుల ఛార్జిషీట్లు దాఖలు చేసినప్పుడు వాటి తేదీలు మీ వద్ద ఉంటాయా? లేదా? కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉన్న తెలంగాణలో ఏ స్టేషన్‌లో ఏం జరిగినా ఒక్క క్లిక్‌తో అన్ని విషయాలూ డీజీపీకి తెలిసే పరిస్థితి ఉందని పోలీసులు చెబుతున్నారు.
మరి ఈ విషయంలో ఎక్కడ తప్పు జరిగిందన్న విషయాన్నైనా మీరు కనీసం కనిపెట్టారా? తప్పు జరిగి ఉంటే ఆ బాధ్యత ఎవరిది? మీ అధికారులదా? లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదిదా? ఇందుకు బాధ్యులైన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారు?’ అంటూ జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి వరుస ప్రశ్నలను సంధించారు.
అందుకు డీజీపీ జితేందర్ స్పందిస్తూ, ఎక్కడ తప్పు జరిగిందో తాము తెలుసుకున్నామని, తమ వద్ద సమాచారం లేకపోవడంవల్లే ఇది జరిగిందని, భవిష్యత్తులో పునరావృతం కానివ్వబోమని న్యాయస్థానానికి తెలిపారు. ఇందులో తమ అధికారిదే తప్పని, ఆయన ప్రభుత్వ న్యాయవాదికి అవసరమైన సమాచారం ఇవ్వలేదని ఒప్పుకున్నారు. ఆ అధికారిపై చర్యలు తీసుకుంటామని డీజీపీ వెల్లడించారు.
ఎవర్ని బాధ్యుల్ని చేస్తున్నారు? : క్రిమినల్ కేసుల్లో తెలంగాణ నుంచి న్యాయస్థానాలకు తగిన సహకారం అందడంలేదని డీజీపీని ఉద్దేశించి జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి పేర్కొనగా, డీజీపీ జితేందర్ క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో అలాంటి లోపాలు లేకుండా చూసుకుంటామని డీజీపీ బదులివ్వగా, ‘ప్రస్తుతం లోపం గురించి ఏమంటారు? దానికి ఎవర్ని బాధ్యుల్ని చేస్తున్నారని జస్టిస్ భట్టి ప్రశ్నించారు. సంబంధిత అధికారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని డీజీపీ పునరుద్ఘాటించారు.
జస్టిస్ హృషీకేశ్‌రాయ్ జోక్యం చేసుకుంటూ, తెలంగాణ నుంచి తమకు తరచూ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. అనంతరం జస్టిస్ భట్టి స్పందిస్తూ ‘డీజీపీ చెప్పింది విన్నాం, తర్వాత అన్నీ మరిచిపోయి కేసును మూసేశాం అనుకోవద్దు. మా ఆదేశాలకు అనుగుణంగా ఏ చర్యలు తీసుకున్నారు, పరిస్థితులను మెరుగుపరచడానికి ఏం చేశారన్నది తెలుసుకోవాలనుకుంటున్నాం.
మీ అధికారిని ఇక్కడ హాజరవ్వాలని ఆదేశించడానికి కారణమేంటంటే, వారి వాదనలు పూర్తిగా రాజకీయ ఆదేశాలకు అనుగుణంగా ఉంటున్నాయి. మీరు దాని ప్రకారం ఎఫ్‌ఐఆర్‌లను అంగీకరించి ఛార్జిషీట్లు దాఖలు చేస్తున్నారు. అందుకే మేం ఎఫ్‌ఐఆర్ తేదీ, ఆ తర్వాత ఎన్ని రోజుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేశారని అడిగాం. దానిపై డీజీపీని అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పండి’ అని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది దేవినా సెహగల్‌ను ఆదేశించారు.
అంతకుముందు జస్టిస్ భట్టి, న్యాయవాది దేవినా సెహగల్ కోర్టుకు సహకరిస్తున్న విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకు ఆమె క్షమాపణలు చెప్పారు. మళ్లీ డీజీపీ హాజరుకావాల్సిన అవసరం లేకుండా మినహాయింపునివ్వండి అని ఆమె చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు. మేం వ్యక్తం చేసిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని, లేదంటే హాజరు కావాల్సి వస్తుందని జస్టిస్ భట్టి స్పష్టం చేశారు.