Girls Upper Hand In M.Tech Admissions in Telangana : రాష్ట్రంలో మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ప్రవేశాల్లో అమ్మాయిలు అబ్బాయిలను తొలిసారిగా అధిగమించారు. ప్రస్తుత విద్యాసంవత్సరం ఆయా కోర్సుల్లో చేరిన వారిలో 51.11% మంది అమ్మాయిలే కావడం విశేషం. గతేడాది స్వల్పంగా అబ్బాయిల ఆధిపత్యం ఉండగా ఈసారి వెనుకబడ్డారు. ఇప్పటివరకు ఫార్మసీ, బీఈడీ, డిగ్రీ, సంప్రదాయ పీజీ కోర్సుల్లో అబ్బాయిల శాతం కంటే అమ్మాయిలు ఎక్కువగా ఉండేది. దీంట్లో ఇప్పుడు ఎంటెక్ కూడా చేరిపోయింది.
మాస్ట్‌ర్స్ ఆఫ్ టెక్నాలజీలో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత మూడు సంవత్సరాలుగా కన్వీనర్ కోటాలో జరిగిన ప్రవేశాల గణాంకాలను చూస్తే ఆ విషయం తెలుస్తోంది. 2022లో 2,408మంది అడ్మిషన్ తీసుకోగా, ఈ ఏడాది ఫస్ట్ కౌన్సెలింగ్‌లోనే 4,351మంది సీట్లు రావడం విశేషం.
గుడ్ న్యూస్- యూనివర్సిటీల్లో ఇకపై ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు - UGC Admissions
సీఎస్‌ఈ వైపే మొగ్గు : సెకెండ్ ఫేజ్ అనంతరం ఈ సంఖ్య 4,500 వరకు చేరుకోవచ్చని అధికారుల అంచనా వేస్తున్నారు. ఒకవేళ వారిలో అందరూ చేరకున్నా ఈ సంఖ్య కనీసం నాలుగు వేలకు తగ్గదని అంటున్నారు. పైగా మొత్తం ఎంటెక్ సీట్లలో చేరిన వారిలో మూడోవంతు మంది సీఎస్‌ఈ బ్రాంచీనే తీసుకుంటున్నారు. ఈసారి ప్రవేశాలు పొందిన 4,351 మందిలో 1,462 మంది ఆ బ్రాంచీ వారే ఉండటం గమనార్హం. ఇది 33.60 శాతంతో సమానం.
ఈ కోర్సులో చేరిన 1,462 మందిలోనూ 900 మంది అమ్మాయిలే ఉన్నారు. ఈసీఈ, ఎలక్ట్రికల్‌ల్లోనూ వారి సంఖ్యే ఎక్కువగా ఉందని పీజీ ఈసెట్ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య పి.రమేష్‌బాబు పేర్కొన్నారు. 2023-24 సంవత్సరంలోనూ ఈ మూడు బ్రాంచీల్లో వారే ఎక్కువగా ఉన్నారని తెలిపారు.
కాలేజీల్లో అధ్యాపకులుగా పని చేసేందుకు అమ్మాయిలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని జేఎన్‌టీయూహెచ్ ఆచార్యులు విజయకుమార్‌రెడ్డి చెప్పారు. ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు సైతం వారిని ప్రాధాన్యత ఇస్తూ నియమించుకుంటున్నారు. దానికితోడు అధ్యాపకులుగా చేరితే ఉన్న ప్రాంతంలోనే పని చేసుకువచ్చుని, బీటెక్‌లో సీఎస్‌ఈ, ఐటీ సంబంధిత బ్రాంచీల్లోనే 70% విద్యార్థులు చేరుతున్నారని తెలిపారు. కళాశాలల్లో సీట్లు కూడా ఈ బ్రాంచీల్లోనే అధికంగా ఉంటున్నాయన్న ఆయన ఈ కోర్సులను బోధించే వారికి ప్రైవేట్ కళాశాలల్లో డిమాండ్ పెరిగిందని వివరించారు. ఐటీ, ఇతర కొలువులు చేయడానికి ఆసక్తి చూయించని వారు ఎంటెక్ సీఎస్‌ఈ చదివేందుకు మొగ్గు చూపుతున్నారని చెప్పారు.