Weddings in Hyderabad : భాగ్య నగరానికి పెళ్లి కళ వచ్చేసింది. రాబోయే మూడు నెలల పాటు మంచి ముహూర్తాలు ఉండటంతో పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నట్టు పురోహిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. మూడు జిల్లాల్లో గత ఐదేళ్లలో జరిగిన పెళ్లిళ్లిలతో పోల్చితే, అత్యధికంగా వచ్చే మూడు నెలల్లో దాదాపు 5 వేల వివాహాలు జరగనున్నట్టు బ్యాంకెట్‌హాళ్లు, ఫంక్షన్‌హాళ్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు.
పెరిగిన అడ్వాన్స్ బుకింగ్‌లు : వివాహాలు, నూతన గృహ ప్రవేశాలు, ఉపనయనాలు తదితర శుభకార్యాలకు ఈ నెల ఎంతో అనుకూలమైనదని రాష్ట్ర అర్చక సంఘం కన్వీనర్ శ్రీరంగం గోపీక్రిష్ణమాచార్యులు పేర్కొన్నారు. ఫంక్షన్ హాళ్లకు ఇప్పటికే బుకింగ్‌లు మొదలయ్యాయని ఆయన తెలిపారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో 25 రోజుల పాటు మంచి శుభ ముహూర్తాలు ఉండటంతో మండపాలను అలంకరించే వారికి, బాజాభజంత్రీలు, కేటరింగ్ సంస్థలకు సైతం ఆర్డర్లు పోటెత్తాయి. ఈ నెల దసరా ఉత్సవంతో పాటు శుభకార్యాలకు అనువైన మాసం కావడంతో మార్కెట్‌లోనూ సందడి నెలకొంది. బంగారం దుకాణాలు, వస్త్ర దుకాణాల్లోనూ అమ్మకాలు పెరిగినట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా 48 లక్షల పెళ్లిళ్లు : భారతీయ సమాజంలో పెళ్లికి ఉన్నంత ప్రాధాన్యం, ప్రత్యేకత మరే సందర్భానికీ ఉండదు. తమ వారి పెళ్లి కోసం ప్రతి కుటుంబం కొన్నిసార్లు శక్తి మేర ఎక్కువ సార్లు శక్తికి మించి ఖర్చు చేస్తుంటాయి. ఖరీదైన బట్టలు, ఆభరణాలు, విలాసవంతమైన వస్తువులు, వాచీలు, అలంకరణ సామగ్రి కొనుగోళ్లు, భోజనాలు, కార్లు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లలో గదులను అద్దెకు బుక్ చేయడం ఇలా ఎన్నో అవసరాలకు డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది.
రానున్న పెళ్లిళ్ల సీజన్‌లో 48 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(CAIT) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. పెళ్లిళ్ల కోసం చేసే ఖర్చులతో వివిధ రంగాల్లో రూ.6 లక్షల కోట్ల మేర వ్యాపారం జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఒక్క దిల్లీలోనే నాలుగున్నర లక్షల వివాహాలు జరుగుతాయని వెల్లడించింది. రూ.6 లక్షల కోట్ల వ్యాపారంలో దిల్లీ వాటా లక్షన్నర కోట్ల వరకు ఉంటుందని వివరించింది. నవంబరు 12వ తేదీన నుంచి డిసెంబరు 16వ తేదీన మధ్య 18 రోజులు దివ్యమైన ముహుర్తాలు ఉన్నాయని బీజేపీ ఎంపీ, సీఏఐటీ నేషనల్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖాన్‌దెల్‌వాల్ తెలిపారు.
పెళ్లి కోసం అప్పు - లాభమా? నష్టమా? ఆర్థిక నిపుణుల మాటేంటి? - Wedding With Personal Loan