IMD Issued Red Alert to Telangana : వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.
అర్ధరాత్రి కలింగపట్నం ప్రాంతంలో వాయుగుండం తీరాన్ని దాటినట్లు చెప్పింది. మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, జనగాం జిల్లాల్లో గడిచిన 24గంటల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు పడ్డాయని తెలిపింది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 43.8, వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడలో 43.5, సూర్యాపేట జిల్లా ముకుందాపురం 42.5, ఖమ్మం జిల్లా కాకర్వాయి 42.2, ములుగు జిల్లా తాడ్వాయిలో 25 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.