Forest Officials Arrest the Person : నేటికాలంలో సోషల్‌మీడియాలో పాపులారిటీ అందరికి కీలకంగా మారింది. అందుకోసం చేయని పనంటూ లేదు. నిద్రలేవడం మొదలు పడుకునేంత వరకు అర్ధంపర్ధం లేని వీడియోలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తున్నారు. కొందరు కొత్త ప్రదేశాలకు వెళ్లి ట్రావెల్ వీడియోలు చేస్తూ పాపులర్ అవుతుంటే, మరికొందరు విభిన్న వంటకాలతో రెసిపీలు చేస్తూ వ్యూయర్‌షిప్ పెంచుకుంటున్నారు.
క్రేజ్ కోసం : ఇతను మాత్రం ఏదైనా విభిన్నంగా చేయాలని అనుకున్నాడు. సాధారణ వంటకాలతో మజా ఏముందని భావించడేమో, ఎవరూ చేయని దాంతో రెసిపీని చేసి క్రేజ్ తెచ్చుకుందామని ప్రయత్నించాడు. అందుకోసం ఏకంగా జాతీయపక్షి నెమలి కర్రీ రెసిపీ పేరుతో వీడియో చేసి చివరికి పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్ అనే యూట్యూబర్, చికెన్ కర్రీ వండి నెమలి ఫోటో గ్రాఫిక్స్‌తో తను పట్టుకున్నట్లు ఇంటర్‌నెట్‌లో పెట్టాడు.
వీడియో వైరల్ : నెమలి కూర సాంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి అంటూ వంటకాన్ని సిద్ధం చేసి యూట్యూబ్‌లో పెట్టాడు. తర్వాత నెటిజన్ల నుంచి వచ్చినటువంటి కామెంట్లకు భయపడి వెంటనే యూట్యూబ్ నుంచి వీడియోను డిలీట్ చేశాడు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ప్రణయ్‌ని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి కోడి ఈకలు, కర్రీని స్వాధీనపరుచుకున్నారు. వాటిని ల్యాబ్‌కు పంపించడం జరుగుతుందని, నెమలి వంటకమని తేలితే అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఆటవీశాఖ అధికారిణి కల్పనాదేవి తెలిపారు.
"రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్ అనే యూట్యూబర్, పీకాక్ కర్రీ పేరుతో వీడియో చేసి ఇంటర్‌నెట్‌లో పెట్టాడు. అతని వద్ద నుంచి కోడి ఈకలు, కర్రీని స్వాధీనపరుచుకున్నాము. వాటిని ల్యాబ్‌కు పంపించడం జరుగింది. ఒకవేళ నెమలి వంటకమని తేలితే అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము". - కల్పనా దేవి, ఫారెస్ట్ ఆఫీసర్
పెళ్లిపందిట్లో వరుడిపై యాసిడ్ పోసిన యువతి - Girlfriend Acid Attack on Young Man
గౌడవెల్లి వద్ద రైలు ప్రమాదం- ఇద్దరు కుమార్తెలు సహా తండ్రి మృతి - Three People Died Hit by Train