TGRTC Income Full with Mahalakshmi Scheme : రాష్ట్రంలో అమలవుతున్న మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సులు కిక్కిరిసిపోతుండటంతో కండక్టర్లకు టిక్కెట్లు జారీ చేసేందుకు వీలు కూడా కలగడం లేదు. అంతేకాకుండా ఆదాయాన్ని సమకూర్చుకొనేందుకు పలుచోట్ల సూపర్ లగ్జరీ బస్సులు ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్టాండులు ఎప్పుడు చూసినా ప్రయాణికులతో కిటకిటలాడే పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలోనే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులో సీట్ల అమరికకు కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టింది. మెట్రో రైళ్లల్లో మాదిరిగా బస్సుల్లోనూ సీట్లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా బస్సు మధ్యలో ఉన్న ఆరు సీట్లను తొలగించి, అదే స్థానంలో బస్సు వాల్స్‌కు సమాంతరంగా సీట్లు ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా కొన్ని రూట్లలో ఆర్టీసీ దీన్ని పరీక్షిస్తోంది.
కరీంనగర్ పరిధిలో 6కోట్ల 35లక్షల మంది ప్రయాణం : మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ప్రయాణానికి విపరీతంగా డిమాండ్ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఒకప్పుడు రోజుకు రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే, ప్రస్తుతం ఈ సంఖ్య ఏకంగా 18 నుంచి 20 లక్షలకు చేరింది. ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. రద్దీలో బస్సులు ఎక్కలేక, దిగలేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
More Bus Services Need to be Introduced for Passengers : మరోవైపు, కండక్టర్లకు టిక్కెట్ల జారీ కూడా ఇబ్బందిగా మారింది. అయితే, ప్రతి ఒక్కరికీ జీరో టిక్కెట్ జారీ చేయాలన్న నిబంధన అమలవుతుండటంతో కండక్టర్లు ఇక్కట్లు పాలవుతున్నారు. ఈ సమస్యకు తక్షణ పరిష్కారంగా ఆర్టీసీ సీట్ల అమరికలో మార్పునకు శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ బస్సుల్లో 44 సీట్లుంటాయి. 63 మంది ప్రయాణిస్తే బస్సు ఆక్యుపెన్సీ రేషియో 100 శాతానికి చేరినట్టు భావిస్తారు. అయితే మహిళలు అధికంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని కండక్టర్లు చెబుతున్నారు. కొన్నిసార్లు పూర్తిగా బస్సుల్లో మహిళలే ఉంటున్నారని అంటున్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ఎంతో బాగుందని చెబుతూనే, మరికొందరు పలు సూచనలు చేస్తున్నారు. ఉద్యోగం చేసే మహిళలకు మినహాయించాలని, బస్సులకు చాలాసేపు వేచి ఉండాల్సి వస్తోందంటున్నారు. అంతేకాకుండా రద్దీ పెరగడం బస్సుల సంఖ్య తగ్గడం వల్ల సీట్లు దొరకడం లేదని చెబుతున్నారు. వికలాంగులకు, చిన్నపిల్లలకు కూడా ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. పెరిగిన రద్దీ కారణంగా ఆదాయం పెరిగిన దృష్ట్యా ప్రయాణికులకు మరిన్ని సర్వీసులు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
ప్రయాణికుల భద్రతపై టీజీఆర్టీసీ కీలక నిర్ణయం- ఏంటంటే? - TGRTC Key Decision