Group-1 Mains Exam Schedule Release in Telangana : తెలంగాణ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లలో డిస్క్రిప్టివ్ విధానంలో మెయిన్స్ ఉంటుందని, అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న భాషలోనే పరీక్ష రాసే వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. ప్రతి పేపర్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనుంది. ఇందుకోసం పరీక్ష వివరాలతో టైం టేబుల్‌ను రిలీజ్ చేసింది.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇదే :
జనరల్ ఇంగ్లీష్(క్వాలిఫయింగ్ టెస్ట్) – అక్టోబర్ 21
పేపర్ 1(జనరల్ ఎస్సే) – అక్టోబర్ 22
పేపర్ 2(హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ) – అక్టోబర్ 23
పేపర్ 2 (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గవర్నెన్స్) – అక్టోబర్ 24
పేపర్ 4(ఎకానమి అండ్ డెవలప్‌మెంట్) – అక్టోబర్ 25
పేపర్ 5(సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్‌ప్రిటేషన్) – అక్టోబర్ 26
పేపర్ 6(తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్) – అక్టోబర్ 27
రేపు గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక 'కీ' విడుదల : రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన టీజీపీఎస్సీ, జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా 895 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను ఓఎంఆర్ విధానంలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 4.03 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక 'కీ' రేపు(గురువారం) విడుదల చేయనున్నారు. అలానే ఈనెల 13 నుంచి 17 వరకు 'కీ'పై ఏవైనా అభ్యంతరాల ఉంటే స్వీకరించనున్నారు.
అంతకుముందు 2022 ఏప్రిల్ 26 న 503 పోస్టుల నియామకానికి ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. 2022లో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ, ప్రిలిమినరీ నిర్వహించింది. పేపర్ లీకేజీ కారణంగా ఆ ఎగ్జామ్‌ను రద్దు చేసి రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించింది. కానీ పరీక్ష నిర్వహణలో సరైన నియమ నిబంధనలు పాటించలేదని కొందరు అభ్యర్థులు న్యాయస్థానానికి వెళ్లగా రెండోసారి పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో టీజీపీఎస్సీ సవాల్ చేసి, మరల వెనక్కి తీసుకుంది. ఈవిధంగా పలుమార్లు గ్రూప్-1 రద్దు అనంతరం తొలిసారి ప్రధాన పరీక్షకు సుదీర్ఘ నిరీక్షణ, ఉత్కంఠలకు తెర దించుతూ భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.