Drugs Supply in Telangana : రాష్ట్రంలో మత్తు పదార్థాల సరఫరాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా దందా మాత్రం ఆగడం లేదు. అక్రమార్కులు ఏదో విధంగా నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తూ విక్రయిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు మరో ముందడుగు వేశారు. వినోదం ముసుగులో మత్తు పదార్థాలకు చిరునామాగా మారిన పబ్‌లను దారికి తెచ్చేందుకు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ఇటీవల కొద్ది రోజుల వ్యవధిలోనే పబ్‌లలో 14 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
విస్తృతంగా సోదాలు : డ్రగ్స్ కట్టడికి టీజీన్యాబ్, ఆబ్కారీ అధికారులు సంయుక్తంగా గత శుక్రవారం అర్ధరాత్రి దాటాక పబ్‌లలో తనిఖీలు చేపట్టారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి పర్యవేక్షణలో జూబ్లీహిల్స్, మాదాపూర్‌లలోని పబ్‌లలో రాత్రి 11 నుంచి 1 గంట వరకూ సోదాలు చేశారు. 33 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్‌తో పరీక్షలు నిర్వహించారు. మైనర్‌కు మద్యం విక్రయించిన పబ్‌పై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో సంయుక్త కమిషనర్ ఖురేషీ, సహాయ కమిషనర్ ఆర్.కిషన్, అనిల్‌కుమార్‌రెడ్డి, టీజీ నాబ్ పోలీసులు పాల్గొన్నారు.
క్షణాల్లో నిర్దారణ : మత్తు పదార్థాల సరఫరా, డ్రగ్స్ వినియోగం కట్టడికి ఇకపై మరింత దూకుడుగా వ్యవహరించేందుకు ఆబ్కారీ, పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. వారాంతపు సమయాల్లో నగరంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్టు ఆబ్కారీ అధికారులు స్పష్టం చేశారు. అనుమానితుల మూత్ర నమూనాలు సేకరించి డ్రగ్స్ డిటెక్షన్ కిట్‌లతో కేవలం 2-5 నిమిషాల వ్యవధిలో గుర్తించవచ్చు. ఇందుకోసం ర్యాపిడ్ కిట్లను సిద్ధం చేసుకున్నారు.
ఈ కిట్ల ద్వారా 27 రకాల మత్తు పదార్థాల్లో ఏది సేవించిన ఇట్టే నిర్ధారణ అవుతుంది. బెంగళూరు, ముంబయి, దిల్లీ తదితర ప్రాంతాల నుంచి వస్తున్న నైజీరియన్లు, డీజేల ద్వారా పబ్‌లకు హెరాయిన్, కొకైన్, ఎల్‌ఎస్‌డీబ్లాట్స్ చేరుతున్నట్టు పోలీసుల తనిఖీల్లో బయటపడ్డాయి. మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు గుర్తించిన వారికి డ్రగ్స్ ఎక్కడ నుంచి వచ్చాయి. ఎవరి ద్వారా అమ్మకాలు చేశారనే వివరాలను సేకరిస్తున్నారు. అక్కడ లభించిన ఆధారాలతో డ్రగ్స్ ముఠాను గుర్తించి అరెస్ట్ చేసేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.
డ్రగ్స్ కేసుల నిందితులతో - చంచల్‌గూడ జైలు హౌజ్‌ఫుల్ - CHANCHALGUDA JAIL OVER CROWDED