Application For New Liquor Shops in AP : ఏపీలో కొత్తగా మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా, మొదటిరోజైన మంగళవారం 200కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో ఆఫ్‌లైన్ విధానంలో స్థానిక ఎక్సైజ్ స్టేషన్లలో నేరుగా సమర్పించినవే అధికంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి ఎక్సైజ్ శాఖ సోమవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి విధితమే.
చివరి 3 రోజుల్లో ఎక్కువ దరఖాస్తులు : మంగళవారం అమావాస్య కావడంతో వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం. మొత్తంగా లక్షకు పైగా దరఖాస్తులు రావొచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేశారు. నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుముల రూపంలోనే దాదాపు రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని వారు భావిస్తున్నారు. 2017లో 4,380 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇవ్వగా, ఒక్కో దానికి సగటున 18 చొప్పున మొత్తంగా 78 వేల దరఖాస్తులు అందాయి. ఈసారి 3,396 దుకాణాలకుగానూ ఒక్కో దానికి సగటున 30 వరకు దరఖాస్తులు పడతాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల తొమ్మిది వరకు గడువు ఉండగా, చివరి 3 రోజుల్లో ఎక్కువ దరఖాస్తులు పడే అవకాశముంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ఇలా :
- మద్యం దుకాణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
- ముందుగా hpfsproject.com వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- ఫోన్ నంబర్‌నే యూజర్ ఐడీగా వినియోగించుకొని, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
- తర్వాత యూజర్ నేమ్, పాస్‌వర్డ్ లేదా ఓటీపీతో లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవచ్చు.
- దీనికి సంబంధించిన సమగ్ర యూజర్ మాన్యువల్‌ను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
- దరఖాస్తు విధానానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెబ్‌సైట్‌లో పెట్టారు.
అత్యధికంగా విశాఖలో: ఎక్సైజ్ శాఖ నోటిఫై చేసిన 3,396 దుకాణాల్లో 2,261 (66.57 శాతం) మండలాల్లోనే ఏర్పాటు చేయనుంది. నగరపాలక సంస్థల పరిధిలో 511, పురపాలక సంఘాల్లో 499, నగర పంచాయతీల్లో 125 చొప్పున నోటిఫై చేసింది. అత్యధికంగా విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలో 136, గుంటూరులో 52 చొప్పున ప్రకటించింది. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా తిరుపతిలో 227, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో 40 దుకాణాలను నోటిఫై చేసింది.
90 రోజుల్లోగా ప్రక్రియ పూర్తి : నూతన మద్యం పాలసీలో భాగంగా దుకాణాల్లో నేషనల్, మల్టీ నేషనల్ బ్రాండ్లను అందుబాటులో ఉంచనున్నారు. వినియోగదారులు కోరుకునే బ్రాండ్లన్నీ ఈ ప్రాంతాల్లో విక్రయిస్తారు. సరఫరా కంపెనీల నుంచి మద్యం కొనుగోలు కోసం చెల్లించే బేసిక్ ప్రైస్ (మూల ధర)ను చెల్లించేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని వేయనుంది. 90 రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు.
ప్రస్తుతం మద్యంపై 10 రకాల పన్నులు విధిస్తుండగా, తాజా విధానంలో వాటిని 6 కుదించారు. ఎక్సైజ్ డ్యూటీ, రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్, వ్యాట్, స్పెషల్ మార్జిన్, అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకం, రౌండింగ్ ఆఫ్ పన్నులు ఉంటాయి.
Telangana Wine Shops Lucky Draw : ప్రశాంతంగా ముగిసిన మద్యం దుకాణాల లైసెన్స్‌ల టెండర్ ప్రక్రియ
మందుబాబులకు బిగ్ రిలీఫ్ - తగ్గనున్న అన్ని బ్రాండ్ల ధరలు - New Liquor Policy 2024 in AP