Telugu Desam Parliamentary Party Meeting : ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తొలి సమావేశం జరిగింది. అందుబాటులో ఉన్న ఎంపీలు స్వయంగా హాజరుకాగా దిల్లీ, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో ఎగరొద్దని ఎంపీలకు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలని సూచించారు.
రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోని వైసీపీ ఎంపీలు జగన్ కేసుల మాఫీ అజెండాతోనే దిల్లీలో పైరవీలు చేశారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాలే మనందరి ప్రథమ కర్తవ్యం కావాలన్న చంద్రబాబు అందుకు తగ్గట్టుగానే పార్లమెంట్లో కృషి చేయాలన్నారు. ముందు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించాలి, ఆ తర్వాతే మనమని చంద్రబాబు తెలిపారు. వ్యవస్థలకు ఆతీతంగా ఎవరు వ్యవహరించినా, ఆ వ్యవస్థే తిరిగి కాటేస్తుందని గుర్తించాలన్నారు.
పదవులు శాశ్వతం అని ఎవ్వరూ అనుకోవద్దని అన్నారు. మన ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించాం, ఆయన వచ్చేందుకు సానుకూలంగా స్పందించారని చంద్రబాబు తెలిపారు. కార్యకర్తలను గౌరవించేలా నాయకులు పనిచేయాలని సూచించారు. 5 ఏళ్ల పాటు అనేక సవాళ్లు, సమస్యలు ఎదుర్కొని పార్టీని కార్యకర్తలే నిలబెట్టారని అన్నారు. నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎంపీలుగా మంచి పనితీరు కనబరిచి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆసక్తికర ఘటన జరిగింది. ఒక సామాన్యమైన కార్యకర్తకు, చిన్న నాయకులకు కూడా పార్టీలో పదవులు, అవకాశాలు కల్పించే విధంగా తన నిర్ణయాలు ఉంటున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. నాయకులుగా ఉన్న మీరు, ఇతర నాయకులతో కూడా అలాగే ఉండాలని దిశానిర్దేశం చేశారు. కష్టపడి, విధేయతతో ఉంటే పదవులు వస్తాయని దానికి విజయనగరం ఎంపీగా గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడే ఉదాహరణ అని అన్నారు.
అప్పలనాయుడుకు ఎంపీ టిక్కెట్ ఇస్తే చాలా మంది చాలా వ్యాఖ్యలు చేశారని అయితే కష్టపడి పనిచేసి అందరినీ కలుపుకుని పోయి కలిశెట్టి గెలిచాడని అభినందించారు. అప్పల నాయుడు ఆర్థికంగా బలవంతుడు కాకపోయినా పార్టీలో ఉన్న సామాన్యులకు టిక్కెట్లు వస్తాయి అనడానికి ఇదొక ఉదాహరణ అని చంద్రబాబు వివరించారు. ఎంపీలందరూ నేటి రాత్రికి, లేదా రేపు ఉదయానికి డిల్లీ చేరుకోవాలని సూచించారు. అప్పల నాయుడూ ఫ్లైట్ టిక్కెట్ ఉందా తీసుకున్నావా అంటూ అప్యాయంగా అడిగారు. లేదంటే చెప్పు మన వాళ్లు టిక్కెట్ బుక్ చేస్తారని చంద్రబాబు ఆరా తీయడంతో కలిశెట్టి భావోద్వేగానికి గురయ్యారు.