Telangana Registrations Income Decreased : తెలంగాణ రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.18,500 కోట్లు రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో శాసనసభ ఎన్నికలు, ఇతర కారణాల వల్ల ప్రభుత్వ లక్ష్యం మేరకు రాబడులు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రధానంగా వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు భారీగా తగ్గినట్లు, తద్వారా వచ్చే ఆదాయం కూడా పడిపోయినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
2019-20 ఆర్థిక ఏడాదిలో 16.59 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, తద్వారా రూ.7061 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా రిజిస్ట్రేషన్లు భారీగా పడిపోయాయి. ఆ ఆర్థిక ఏడాదిలో కేవలం 12.10 లక్షల రిజిస్ట్రేషన్లు జరగగా, తద్వారా రూ.5,260 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది. 2021-22 ఆర్థిక ఏడాదిలో రిజిస్ట్రేషన్లు తిరిగి పుంజుకున్నాయి. ఆ ఆర్థిక ఏడాది 19.72 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగి తద్వారా రూ.12,370 కోట్లు ప్రభుత్వానికి రాబడి చేకూరింది.
Stalled Property Registrations : రాష్ట్రంలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్‌లు.. రూ.50 కోట్ల మేర గండి!
Telangana Stamps and Registrations Revenue Decrease : 2022-23 ఆర్థిక ఏడాదిలో 19.47 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగి తద్వారా రూ.14,291 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమైంది. ప్రస్తుతం జరుగుతున్న 2023-24 ఆర్థిక సంవత్సరంలో గడిచిన 11 నెలల కాలంలో 16.31 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగి తద్వారా రూ.13,270 కోట్లు ప్రభుత్వానికి రాబడి వచ్చింది. ప్రధానంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు ఫిబ్రవరి నెల రాబడులు స్వల్పంగా రూ.257 కోట్లు పెరిగినప్పటికీ రిజిస్ట్రేషన్లు పెద్ద సంఖ్యలో తగ్గాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు పదివేలకు పైగా భారీగా తగ్గడం, వ్యవసాయేతర ఆస్తులు క్రయవిక్రయాలు స్వల్పంగా పెరగడంతో ఆదాయం కూడా రూ.150 కోట్లు వరకు అధికంగా ఆదాయం వచ్చింది. గడిచిన 11 నెలల్లో 16.31 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యి రూ.13,270 కోట్లు ప్రభుత్వానికి ఆదాయము వచ్చింది.
ఇప్పటి వరకు వచ్చిన రూ.13.270 కోట్లకు మరో రూ.1,350 కోట్లు కలిపితే దాదాపు 14,500 కోట్లుకుపైగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అంచనా వేస్తోంది. ఈ మార్చి నెలలో 1.5లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగి తద్వారా రూ.1300 నుంచి 1350 కోట్లు వరకు ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద 2023-24 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన రూ. 18,500 కోట్లు రూపాయలతో పోలిస్తే 2023-24 ఆర్థిక ఏడాదికి రూ. 14,500 కోట్లు వస్తుందంటే దాదాపు 20శాతం తగ్గుదలను నమోదు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా 2023 సంవత్సరంలో దాదాపు నాలుగు నెలలపాటు శాసనసభ ఎన్నికలు కారణంగా వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు భారీగా తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
వాహనాలకు TG రిజిస్ట్రేషన్ - అందరూ మార్చుకోవాల్సిందేనా? - ఇదిగో క్లారిటీ