Telangana Phone Tapping Case Updates : ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు (DCP RadhaKishan Rao)ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు. ఆయన నుంచి మరింత సమాచారం తెలుసుకోవటంతో పాటు కేసులో మిగిలిన నిందితులిచ్చిన సమాచారాన్ని రాధాకిషన్‌రావుతో నిర్ధారణ చేసుకునేందుకు, ఇవాళ్టి నుంచి కస్టడీలోకి తీసుకున్న దర్యాప్తు బృందం, వారం రోజుల పాటు ప్రశ్నించనుంది.
కేసులో అత్యంత కీలకమైన ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి ఆధారాలు సేకరించడం దర్యాప్తు బృందానికి సవాల్‌గా మారింది. నేరం బయట పడకుండా ఉండేందుకు ప్రణీత్ రావు ముఠా హార్డ్‌డిస్కులను ధ్వంసం చేసి మూసీలో పడేశారు. నేరం చేసినట్లు నిరూపించాలంటే, వాటిలోని సమాచారమే కీలకం. కానీ అవి ధ్వంసమై, బురదలో కూరుకుపోయిన ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి సమాచారాన్ని మళ్లీ ఎలా పునరుద్ధరించాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
ఎస్ఐబీ(SIB)లో హార్డ్‌డిస్కులను ధ్వంసం చేశారన్న ఆరోపణలపైనే పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో తొలుత కేసు నమోదైంది. వాటిని ఎందుకు ధ్వంసం చేశారని విచారించగా, ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐబీ ఓఎస్టీ ప్రభాకర్‌రావు నేతృత్వంలో ప్రణీత్‌రావు తదితరులు అప్పటి ప్రతిపక్షాలకు చెందిన నాయకులు, వారి అనుచరులు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు వెల్లడైంది.
ఆ వివరాలు ఎవరికి పంపారు : ఎవరెవరి ఫోన్లు ఎప్పుడెప్పుడు ట్యాప్ చేశారు, ఏం రికార్డు చేశారు, ఆ వివరాలు ఎవరికి పంపారనే వివరాలు ఆ హార్డ్‌డిస్క్‌ల్లో ఉన్నాయి. అయితే ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగానే, డిసెంబర్ 4న ప్రణీత్‌రావు ట్యాపింగ్ నిర్వహణకు ఏర్పాటు చేసుకున్న కార్యాలయం వద్ద సీసీ కెమెరాలు మూసేసి కంప్యూటర్లలోని హార్డ్‌డిస్కులు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను బయటకు తీసి వాటిని మెటల్ కట్టర్లతో కత్తిరించి నాగోల్ వద్ద మూసీలో పడేశాడు. దస్త్రాలు, ఇతర పత్రాలను ఎస్ఐబీ కార్యాలయం ఆవరణలో తగులబెట్టాడు. కేసు నమోదైన తర్వాత దర్యాప్తులో భాగంగా పోలీసులు మూసీ నుంచి తొమ్మిది హార్డ్‌డిస్కులకు చెందిన శకలాలు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
సవాల్‌గా ఎలక్ట్రానిక్ పరికరాల ఆధారాలు : మామూలుగా అయితే నేరం బయటపడకుండా ఉండేందుకు హార్డ్‌డిస్కుల్లో సమాచారాన్ని చెరిపేస్తారు. సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు ఆ సమాచారాన్ని పునరుద్ధరిస్తారు. కానీ ఈ కేసులో ప్రణీత్‌రావు పోలీస్ తెలివి ఉపయోగించి వాటిని కత్తిరించి మూసీలో పడేశాడు. కొద్దిపాటి తేమ ఉంటే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు చెడిపోతాయి. అలాంటివి బురదలో కూరుకుపోయిన వాటి నుంచి సమాచారం పునరుద్ధరించడం కచ్చితంగా సవాల్‌గా మారింది. పైగా అవి కత్తిరించి ఉన్నందున అందులో నుంచి సమాచారం వస్తుందో లేదో అన్నదీ తెలియదు.
Recover Hard Disks in Phone Tapping Case : వాటి నుంచి సమాచారం సేకరించలేకపోతే అసలు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారో తెలుసుకోవడం కష్టం. అనధికారికంగా జరిగిన ట్యాపింగ్ తతంగమంతా ఆ హార్డ్‌డిస్కుల్లో తప్ప, మరెక్కడా నిల్వ ఉండే అవకాశం లేనందున, ఎట్టి పరిస్థితుల్లో వాటిలోని సమాచారం రాబట్టాలని భావిస్తున్నారు. ఇందుకోసం సైబర్ భద్రతా నిపుణులను సంప్రదిస్తున్నారు. అవసరమైతే వాటిని విదేశాలకు పంపాలని అధికారులు భావిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు- రాధాకిషన్‌రావుకు 7 రోజుల పోలీసు కస్టడీ - phone tapping case update