Phone Tapping Case Chargesheet New UPdate : ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఈ కేసులో అరెస్ట్ అయిన నలుగురు నిందితులపై ఈనెల 10న పంజాగుట్ట పోలీసులు నిందితులపై కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. కానీ పూర్తి వివరాలు లేని కారణంగా కోర్టు తిప్పి పంపింది. శనివారం మరోసారి ఛార్జిషీట్ దాఖలు చేయగా సేకరించిన పూర్తి సాక్ష్యాధారాలను సమర్పించాలంది. దీంతో మంగళవారం పోలీసులు మరో మారు అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఈ కేసులో విచారణాధికారిగా ఉన్న వెంకటగిరి అభియోగ పత్రాలతో పాటు సాక్ష్యాధారాలు నాంపల్లి కోర్టుకు సమర్పించారు. మూడు కాటన్ బాక్సుల్లో ఈ ఆధారాలు కోర్టుకు తీసుకొచ్చారు. ధ్వంసం అయిన హార్డ్ డిస్కులు, కాలిపోయిన ఫోన్ నంబర్ల లిస్ట్, పెన్ డ్రైవ్‌లు, నిందితులు నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలు ఇతర ఆధారాలు తీసుకొచ్చారు.
అయితే వీటిని గోప్యంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టును పోలీసులు కోరినట్లు సమాచారం. కాగా దీనిపై గురువారం కోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు ఛార్జిషీట్ కోర్టులో లేనందున అరెస్ట్ చేసి 90 రోజులు గడిచిన కారణంగా మేండేటరీ బెయిల్ ఇవ్వాలని భుజంగరావు, తిరుపతన్నలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై రేపు విచారణ జరగనుంది. కాగా ప్రణీత్‌రావు సైతం మేండెటరీ బెయిల్ కోసం రెండోసారి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా గురువారం విచారణ జరగనుంది. గతంలో ప్రణీత్‌రావు వేసిన మేండెటరీ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
కాగా ఈకేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు, ఏ6 శ్రవణ్ రావులను విచారించాలని విదేశాల్లో ఉన్న వారి కోసం రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. కోర్టు ఇందుకు అనుమతించింది. అయితే అనారోగ్య సమస్యల వల్ల చికిత్స కోసం వచ్చానని పోలీసులకు అందుబాటులో ఉంటానని జూన్26న భారత్‌కి వస్తానని అడ్వకేట్ ద్వారా ప్రభాకర్ రావు కోర్టులో మెమో దాఖలు చేశారు. కాగా నేటితో ఆ గడువు ముగుస్తుండటంతో పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారో తెలియాల్సి ఉంది.
మరో నిందితుడు శ్రవణ్ రావుకు కూడా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా రెడ్ కార్నర్ నోటీసులు ప్రాసెస్ పనిలో పోలీసులున్నారు. మరో వైపు కేసు నమోదు చేసి 60రోజులకు పైగా అయిందని తమకు తెలిసిన సమాచారమంతా దర్యప్తు అధికారులకు ఇచ్చామని నిందితులు తెలిపారు. బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ప్రణీత్ రావు, భుజంగ రావు, తిరుపతన్నలు నాంపల్లి కోర్టులో రెండుసార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. కానీ కోర్టు తిరస్కరించింది. రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ కూడా కోర్టు తిరస్కరించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు అప్డేట్ - కీలక ఆధారాలు సిట్ చేతికి! - Telangana Phone Tapping Case Update