Telangana Medical Council Raids on Fake Doctors : జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు, వాంతులు, విరేచనాలు ఇలా వ్యాధి ఏదైనా ముందుగా వెళ్లేది దగ్గర్లోని క్లినిక్‌లకే. రోగాలను నయం చేస్తారనే భరోసాతో చికిత్స కోసం వైద్యుడి దగ్గరకు వెళ్లి వేలకు వేలు ఫీజులు చెల్లిస్తాం. అయితే ఇప్పుడు ఆ భరోసానే సమస్యగా మారుతోంది. చికిత్స చేస్తున్నది నిజంగా వైద్యుడా లేదా నకిలీ వైద్యుడా అన్న సందేహం కలుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లోని పలు చోట్ల స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించిన మెడికల్ కౌన్సిల్ భారీగా నకిలీ వైద్యులను గుర్తించటమే ఇందుకు కారణం. నకిలీ వైద్యుల ఆటకట్టించాలని భావించిన రాష్ట్ర మెడికల్ కౌన్సిల్, తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రైడ్‌లు నిర్వహించారు. ఇప్పటికే 50కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా ఇద్దరు నకిలీ వైద్యులను రిమాండ్‌కు పంపారు.
Fake Doctors in Hyderabad : ఈ ఏడాది జనవరి నుంచి మెడికల్ కౌన్సిల్ నకిలీ వైద్యుల కట్టడికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాల్లో పలు మార్లు దాడులు నిర్వహించిన టీఎస్ఎమ్సీ సభ్యులు ఇటీవల హైదరాబాద్ మేడ్చల్ పరిధిలోని ఐడీపీఎల్, చింతల్, షాపూర్‌నగర్ సహా పలు ప్రాంతాల్లో ఎనిమిది బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. కొందరు కనీసం డిగ్రీ లేకుండా వైద్యులుగా చలామణి అవుతున్నట్టు గుర్తించారు. మరికొందరు పలు ఆస్పత్రుల్లో నర్సింగ్ వంటి సేవలు అందించి ఆ తర్వాత సొంతంగా ఎంబీబీఎస్ వైద్యులమని మభ్యపెడుతూ క్లినిక్‌లు ఏర్పాటు చేసినట్టు తనిఖీల్లో తేలింది.
'పది' పాస్ కాలేదు కానీ.. పదేళ్ల నుంచి ‘డాక్టర్’గా..!
"మినిమమ్ క్వాలిఫికేషన్ లేకుండా గ్రామీణ ఇతర ప్రాంతాల్లో, సిటీలో వైద్యాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వచ్చాక అన్ని జిల్లాల్లో కొన్ని కమిటీలు ఏర్పాటు చేసి రైడ్స్ చేస్తున్నాం. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం అర్హత లేనివారు యాంటీబాడీస్, స్టెరాయిడ్స్ ఇవ్వడానికి ఉండదు కానీ ఈ నకిలీ డాక్టర్లు ఇష్టారీతినా ఇస్తున్నారు. అర్హతలు లేకుండా వైద్యం చేస్తున్నవారికి సంవత్సర కాలంపాటు జైలు శిక్ష అలాగే 5లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది." - డా. శ్రీనివాస్, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు
దీనికి తోడు క్లినిక్‌లకు అనుబంధంగా మెడికల్ షాపులు, డయాగ్నోస్టిక్ కేంద్రాలను నిర్వహిస్తున్నారని ఇక ఇలాంటి వారిలో అత్యధిక శాతం మంది రోగులకు ఇష్టారాజ్యంగా మందులు ఇస్తుండటం ఒక్కోసారి రోగి మరణానికి దారి తీస్తోందని టీఎస్ఎమ్సీ కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ వైద్యులను అరికట్టడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని వైద్యుల సంఖ్య పెంచి గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయాలని టీఎస్ఎమ్సీ సభ్యులు కోరుతున్నారు.
గూగుల్ సాయంతో ట్రీట్మెంట్.. 3నెలల క్రితం కొత్త హాస్పిటల్.. 'శంకర్ దాదా' గుట్టురట్టు
నకిలీ వైద్యుల నిర్వాకం- సంతానం కోసం వెళ్తే ప్రాణమే తీసేశారు!