Drug Abuse And Anti Ragging Awareness Program in Hyderabad : రాష్ట్రంలో డ్రగ్స్, ర్యాగింగ్ భూతం పట్టిపీడిస్తోంది. వీటి నివారణకు ప్రభుత్వం అనేక కట్టడి చర్యలు చేపడుతూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో డ్రగ్స్ వినియోగం, ర్యాగింగ్ భూతంపై హైదరాబాద్‌లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమానికి డీజీపీ జితేందర్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
యాంటీ నార్కొటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఉన్నతవిద్యామండలి ఛైర్మన్ లింబాద్రి విశిష్ఠ అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీల కోఆర్డినేటర్లు, ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎన్‌ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని అందరూ ప్రతిజ్ఞ చేశారు.
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణాను మార్చాలనేదే ప్రభుత్వ లక్ష్యమని డీజీపీ జితేందర్ అన్నారు. మాదక ద్రవ్యాల కట్టడికి ప్రభుత్వం పటిష్ఠ వ్యవస్థను ఏర్పాటు చేసిందని తెలిపారు. డ్రగ్స్ వినియోగం వల్ల గొప్పవాల్లమవుతామని భ్రమపడేవాళ్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. స్మగ్లర్లకు డ్రగ్స్ సరఫరా అనేది వ్యాపారమని ఆ ఊబిలోకి సామాన్యులు ఎందుకు దిగుతున్నారని ప్రశ్నించారు. అలాగే సమాజంలో మరో అతిపెద్ద సమస్య ర్యాగింగ్ అన్న డీజీపీ ఇప్పటికే రాష్ట్రంలో నిషేధించిన ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
రాష్ట్రంలో ర్యాగింగ్ అనే పదానికి చోటు లేదని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తేల్చిచెప్పారు. ఒకరినొకరు పరిచయం చేసుకునే క్రమంలో ర్యాగింగ్‌కు పాల్పడటం క్రూరమైన చర్య అని అభివర్ణించారు. ఈ విష సంస్కృతిని కూకటి వేళ్లతో సహా పెకలించివేయాలని పిలుపునిచ్చారు. పోలీసులు విద్యార్థులను ప్రోత్సహించేందుకు కళాశాలలకు రావాలి కానీ అరెస్టులు చేసేందుకు వచ్చేలా విద్యార్థులు ప్రవర్తించకూడదని హితవు పలికారు. అలాగే డ్రగ్స్ వినియోగంలో తోటివారు మిమ్మల్ని బలవంతం చేస్తే మీకే ఆ విచక్షణ ఉండాలని బుర్రా వెంకటేశం వివరించారు. స్వీయ నియంత్రణ ఉంటేనే భవిష్యత్‌లో పెద్ద ఛాలెంజ్‌లను ఎదుర్కోగలమని చెప్పారు. మన చుట్టూ మనం రక్షణ కవచాన్ని ఏర్పరుచుకున్నట్లు ప్రహరీ క్లబ్ అని పాఠశాలల్లో ఇచ్చిన జీవోను కాలేజీల్లో కూడా ప్రవేశపెట్టబోతున్నామని వెల్లడించారు.
డ్రగ్స్, ర్యాగింగ్‌పై యుద్ధం ఇంకా మిగిలే ఉందని యాంటీ నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. ర్యాగింగ్ అనేది విద్యార్థుల భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలిపారు. ఇలాంటి వాటిపై బాధ్యతగల పౌరులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలని సూచించారు. అలాగే డ్రగ్స్, సిగరెట్స్, మద్యపానం వంటివి విద్యార్థులు దూరం పెట్టకపోతే వారి జీవితం అంధకారంలోకి వెళ్తుందన్నారు..
మత్తువదలరా - డ్రగ్స్ మహమ్మారిపై కదం తొక్కిన తెలంగాణ - Anti Drug Rally in Telangana