Telangana High Court on MBBS Admissions : ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానికత అంశాన్ని పక్కకు పెట్టి పిటిషనర్ల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్లు పిటిషనర్ నంబర్లో జాబితా సిద్ధం చేసి సంబంధిత అధికారులకు అందజేయాలని స్పష్టం చేసింది. ఇందుకు ఈనెల 24 లోగా కౌంటర్ దాఖలు చేయాలని సర్కార్‌కు చెప్పింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ మెడికల్ అండ్ డెంటల్ కాలేజీస్ అడ్మిషన్ నిబంధనలను సవాల్ చేస్తూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.
గత నెల 19న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో చట్ట విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. జీవో ప్రకారం విద్యార్థులు 9,10 తరగతులతో పాటు ఇంటర్ స్థానికంగా చదివి ఉండాలని ఉందన్నారు. ఈ నిబంధనలు చట్టవిరుద్ధమని అందుకే జీవోను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు డీవీ సీతారాం మూర్తి, మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు. చాలా మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌ను ఇతర రాష్ట్రాల్లో చదివారని వారంతా ఇక్కడే పుట్టి పెరిగినా, 10వ తరగతి వరకు ఇక్కడే చదివినా జీవో ప్రకారం స్థానికత వర్తించదని అన్నారు.
అదే ఆ నాలుగేళ్లు ఇక్కడే చదివి ఇక్కడ పుట్టకపోయినా వారికి స్థానికత వర్తిస్తుందని ఇది రాజ్యాంగ హక్కులను కాలరాసినట్లేనని అన్నారు. వైద్య విద్య సీట్ల భర్తీలో శాశ్వత నివాసితులైన విద్యార్థులను స్థానికంగానే పరిగణించాలని గత సంవత్సరం ఇదే న్యాయస్థానం స్పష్టం చేసిన విషయాన్ని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు గుర్తు చేశారు.
నీట్, అడ్మిషన్ నోటిఫికేషన్లు వేర్వేరు : ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ. సుదర్శన్ రెడ్డి, కాళోజీ వర్సిటీ తరఫున ఏ. ప్రభాకర్ రావు హాజరై వాదనలు వినిపించారు. నీట్ నోటిఫికేషన్, అడ్మిషన్ నోటిఫికేషన్ రెండు వేర్వేరని అడ్మిషన్లకు ముందే ప్రభుత్వం జోవో ఇచ్చిందన్నారు. ఇది నిబంధనల ఉల్లంఘన ఎంత మాత్రం కాదన్నారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకొని ఫిబ్రవరిలోనే నీట్ ప్రక్రియ ప్రారంభమైనట్లు కదా అని ఏజీని ప్రశ్నించారు. అందుకు ఏజీ బదులిస్తూ అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 3 నుంచే ప్రారంభమైందని చెప్పారు.
ఇతర రాష్ట్రాల్లోని అమల్లో ఉన్న నిబంధనలే ఇక్కడి ప్రభుత్వం అమలు చేస్తోందని న్యాయస్థానం దృష్టికి ఏజీ తీసుకెళ్లారు. ఆర్థికంగా ఉన్న వారు ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ చదివి స్థానికత కోసం పట్టుబట్టడం సరికాదని అన్నారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు స్థానికతను పక్కనపెట్టి ప్రస్తుతానికి అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది.
Costliest MBBS Colleges In India : దేశంలోనే అత్యంత ఖరీదైన MBBS డిగ్రీ.. ఆ కాలేజీలో ఫీజు రూ.కోట్లలో!