Telangana HC Serious on Illegal Construction Permission : అక్రమమని తెలిసీ అనుమతులిచ్చి.. ఆ తర్వాత అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తే అధికారులే పరిహారం చెల్లించాలనే ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. అలాంటి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రస్తుతం ఆదేశాలు జారీ చేశామని తెలిపింది. ఇకపై అక్రమ నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో వాటికి అనుమతులిచ్చిన అధికారుల ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ గ్రామంలోని మంగర్షి కుంట ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగించాలంటూ నీటి పారుదల శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు.
వీటిని సవాల్ చేస్తూ సచిన్ జైశ్వాల్, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఈ నెల 4న గోడకు నోటీసులు అతికించారని, ఏడు రోజుల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగించాలని ఇందులో పేర్కొన్నారన్నారు. అనుమతులు తీసుకుని నిర్మించుకున్న రేకుల ఇళ్లను కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. తమ నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి అధికారులు ఇచ్చిన అనుమతులతో కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు.
అధికారుల ఆస్తులను జప్తు చేస్తే తాతలు కనిపించాలి : బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధి ఎంతవరకో స్పష్టత ఉంటుందని, ఇరిగేషన్, మున్సిపల్, పంచాయతీ అధికారులు జీవో 168 ప్రకారం అనుమతులను ఎందుకివ్వరని న్యాయమూర్తి ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి చెరువుల పరిరక్షణ చేపట్టాలని సుప్రీంకోర్టు సహా ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిన మాట వాస్తవమేననని, అలాగని నిబంధనలను ఉల్లంఘించరాదన్నారు. అక్రమ నిర్మాణాలని తేలినప్పుడు తగిన నోటీసులు జారీ చేసి వివరణ తీసుకుని చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. చెరువులు, కుంటలు వంటి జల వనరుల్లో నిర్మాణాలకు అనుమతులు ఎలా మంజూరు చేస్తారని, నిర్మాణాలకు అనుమతులిచ్చి తీరా అవి పూర్తయ్యాక బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ కూల్చివేస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు.
అక్రమ నిర్మాణాలను కూల్చివేసినందుకు ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని, అది ప్రజాధనమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అధికారులు చేసిన తప్పులకు ప్రభుత్వం ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు. దీనిని అధికారుల నుంచే రాబట్టాలని వారి ఆస్తులను జప్తు చేస్తే తాతలు కనిపిస్తారని వ్యాఖ్యానించారు. నీటిపారుదల శాఖ అధికారులు జారీ చేసిన నోటీసులపై పిటిషనర్లు 15 రోజుల్లో అన్ని ఆధారాలు, పత్రాలతో సమాధానం ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈలోగా నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని అధికారులను ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను మూసివేశారు.
మున్సిపాలిటీల్లో ఆ పంచాయతీల విలీనం ఖాయం - గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు
హైదరాబాద్ నగరంలోని చెరువులపై పూర్తి పర్యవేక్షణ మాదే : హైకోర్టు