HC on MLAs Disqualification Petition : ఎమ్మెల్యేలపై అనర్హతకు సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకున్న తరువాతనే కోర్టులకు సమీక్షించే అధికారం ఉందని ప్రభుత్వంతో పాటు ప్రతివాదుల తరపు న్యాయవాదులు హైకోర్టుకు నివేదించారు. అక్కడ పిటిషన్లు ఇచ్చి వాటిని స్పీకర్ పరిశీలించకముందే కోర్టుకు వచ్చేశారన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా పిటిషన్లు దాఖలు చేశారన్నారు. బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ కౌశిక్ రెడ్డి, వివేకానంద, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి మరోసారి విచారణ చేపట్టారు.
పిటిషన్ స్వీకరణకు స్పీకర్ కార్యాలయం సిద్ధం : దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వరెడ్డి పిటిషన్‌పై న్యాయమూర్తి విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లో అభ్యర్థన పరిమితమని, పిటిషన్ ఇవ్వడానికి వెళ్తే తీసుకోలేదని, రిజిస్టర్ పోస్టుల్లో పంపితే వెనక్కి వచ్చిందని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి న్యాయుమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. తన పిటిషన్‌ను స్వీకరించేలా ఆదేశాలు జారీ చేయాలన్నదేనని, పిటిషన్ తీసుకోవడానికి స్పీకర్ కార్యాలయం సిద్ధమేనని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేస్తూ మహేశ్వర్ రెడ్డి పిటిషన్‌ను స్వీకరించి ధ్రువీకరణ రసీదును ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం కార్యదర్శిని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను మూసివేశారు.
మిగిలిన పిటిషన్లలో ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి, పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే పిటిషనర్లు కోర్టుకు వచ్చారని ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్పీకర్ ఇండిపెండెంట్ ట్రైబ్యునల్ అని, అది తీర్పు వెలువరించిన తరువాతే కోర్టుల జోక్యం ఉంటుందన్నారు. స్పీకర్ నిర్ణయం వెలువరించకముందే న్యాయ సమీక్షపై నిషేధం ఉందన్నారు. ఈ మేరకు గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. 10 రోజుల్లోనే కోర్టుకు వచ్చారన్నారు.
కోర్టులో తేలాకా చూడాలని : కనీస గడువు ఇవ్వలేదని ఏజీ సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఇప్పుడు మూడు నెలలు అయిందన్న వాదన చెల్లదన్నారు. వివాదం కోర్టుల్లో ఉన్నందున స్పీకర్ ఈ పిటిషన్లను పరిశీలన కూడా చేయలేదని కోర్టులో తేలాకా చూడాలని వేచి చూస్తూ ఉండవచ్చన్నారు. గతంలో పార్టీ మారిన తలసానిపై చర్యలు తీసుకోవాలంటూ ఎర్రబెల్లి దయకర్ రావు దాఖలు చేసిన పిటిషన్‌లో కూడా ఈ హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. ఈ పిటిషన్లపై శుక్రవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి.