HC On Durgam Cheruvu FTL Issue : చెరువుల ఎఫ్టీఎల్ పరిధిని ఏ నిబంధన కింద నిర్ధారిస్తారో వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్టీఎల్ను నిర్ధారించడానికి చట్టబద్దమైన నిబంధనలున్నాయా? లేదంటే ప్రభుత్వ ఉత్వర్వులు ఆధారంగా చేస్తారా? అంటూ హైకోర్టు ప్రశ్నించింది. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధి 160 ఎకరాలు ఉందని ఏ ప్రాతిపదికన నిర్ధారించారో చెప్పాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేట గ్రామ సర్వే నెం 47లో అమర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఉన్న తన ప్లాట్లోని నిర్మాణాల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఊర్మిళాదేవి అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాదే, జస్టిస్ జె. శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఎలాంటి చట్టం అమల్లో లేని పక్షంలో : పిటిషనర్ తరపు న్యాయవాది పి.రాయరెడ్డి వాదనలు వినిపిస్తూ నీటిపారుదల శాఖలోని చెరువుల మ్యాప్ ప్రకారం దుర్గం చెరువు విస్తీర్ణం 65 ఎకరాలు ఉందని, అయితే 160 ఎకరాలుగా అధికారులు నిర్ధారించారన్నారు. ఏ ప్రాతిపదికన చెరువు విస్తీర్ణం పెరిగిందో చెప్పలేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చెరువుకు 50 మీటర్లు ఎఫ్టీఎల్గా ఉంటుందని, అయితే అక్కడ ప్రైవేటు భూమి ఉన్నట్లయితే భూసేకరణ చట్టం కింద సేకరించాల్సి ఉందన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఎలాంటి చట్టం అమలులో లేని పక్షంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రామాణికమవుతుందని వ్యాఖ్యానించింది.
ఎఫ్టీఎల్లో లేదని తాము చెప్పిన వెంటనే 2వేలకు పైగా పిటిషన్లు దాఖలవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదంది. ఎఫ్టీఎల్ నిర్ధారణకు అనుసరించే పద్ధతులు, నిబంధనలు ఏమైనా ఉంటే చెప్పాలని ఆదేశించింది. ఒకవేళ లేని పక్షంలో మార్గదర్శకాలు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను 23కు వాయిదా వేసింది.
HC On Motor Vehicle Act : మోటారు వాహన చట్టం నిబంధనలను అమలు చేయకపోవడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 1988 మోటారు వాహనాల చట్టంలోని పలు నిబంధనలకు 2019లో కేంద్రం సవరణ తీసుకురాగా వాటిని రాష్ట్రంలో అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్కు చెందిన రమన్ జీత్ సింగ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాదే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.