Telangana High Court on Group 4 Appointments : గ్రూప్-4 పోస్టుల భర్తీ తుది తీర్పునకు లోబడే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే నియామకాలు ప్రారంభమైనందున ఇవి తుది తీర్పునకు లోబడి ఉంటాయని తెలిపింది. ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్ల కల్పనపై 10 రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్‌పై పిటిషన్ : గ్రూప్-4 పోస్టుల భర్తీ నిమిత్తం 2022 డిసెంబరులో జారీ చేసిన నోటిఫికేషన్‌లో ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించకపోవడంపై సూర్యాపేట జిల్లాకు చెందిన దేవత్ శ్రీనుతో పాటు మరో ముగ్గురు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. గ్రూప్-4 ఫలితాలు విడుదలై, నియామకాలు ప్రారంభమైనందున వారి వేసిన పిటిషన్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.
జాతీయ న్యాయసేవాధికార సంస్థ వర్సెస్ కేంద్రం కేసు : పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ న్యాయసేవాధికార సంస్థ వర్సెస్ కేంద్రం కేసులో 2014లో సుప్రీం కోర్టు ఆదేశించిందని తెలిపారు. అంతేగాకుండా ఇదే హైకోర్టు ట్రాన్స్జెండర్లకు హారిజాంటల్ రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశాలు జారీ చేసిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ ప్రారంభమైనందున గ్రూప్-4 పోస్టుల నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ఆదేశించాలని కోరారు.
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ కౌంటరు దాఖలు చేయడానికి 10 రోజుల గడువు కావాలని హైకోర్టును కోరారు. వాదనలను విన్న ధర్మాసనం కౌంటరు దాఖలుకు ప్రభుత్వానికి అవకాశం కల్పించింది. మరోవైపు ఈలోగా చేపట్టే నియామక ప్రక్రియ తుది తీర్పునకు లోబడి ఉంటుందంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.