Telangana Govt Focus On Improving Registrations Income : రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ రాబడి పెంపునకు లోతైన అధ్యయనం కొనసాగుతోంది. 2023-24 ఆర్థిక ఏడాదిలో వచ్చిన రాబడుల ఆధారంగా అదనపు ఆదాయం వచ్చే ప్రాంతాలను గుర్తించి అక్కడ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు 2023-24 ఆర్థిక ఏడాదిలో 18.26లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.14,588 కోట్లు ఆదాయం వచ్చింది.
అందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి రూ.4 వేల 926 కోట్లు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి రూ.2 వేల 531 కోట్లు, సంగారెడ్డి జిల్లా నుంచి రూ.1,417 కోట్ల లెక్కన వచ్చాయి. ఈ మూడు జిల్లాల నుంచి అత్యధికంగా 62శాతం అంటే రూ.8 వేల 874 కోట్లు రాబడి వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి.
అధికారులతో మంత్రి పొంగులేటి చర్చలు : రాష్ట్రంలో 2024-25 ఆర్ధిక ఏడాదిలో రూ.18వేల 500 కోట్లు రాబడి కోసం ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు రూ.6,080 కోట్ల రాబడి వచ్చింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే దాదాపు 6.9శాతం పెరుగుదల నమోదైంది. ఆగస్టు నుంచి రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు పెరుగుతాయని ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. కానీ మార్కెట్ ధరలు పెంచేందుకు చేపట్టిన కసరత్తు పూర్తికాలేదు. దీంతో సబ్ రిజిస్ట్రార్లు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇచ్చిన నివేదికలపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉన్నతస్థాయి అధికారులతో చర్చించారు.
పలు రాష్ట్రాల్లో పర్యటన : శాస్త్రీయబద్దంగా ధరలు సవరణకు మరింత లోతైన అధ్యయనం జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ముగ్గురు డీఐజీల ఆధర్వ్యంలో ప్రత్యేక బృందాలు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల్లో పర్యటించి అక్కడ అమలవుతున్న తీరును పరిశీలించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఓ బృందం తమిళనాడు వెళ్లిరాగా మరో రెండు బృందాలు కర్ణాటక, మహారాష్ట్ర వెళ్లనున్నాయి. వీరి నివేదిక ఆధారంగా రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలతో పాటు ఇతర సేవల ధరలను సవరించనున్నారు.