Uniform Stitching Contract To Women In Suryapet : మహిళలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. మహిళా స్వశక్తి కుట్టు కేంద్రాలను ఏర్పాటు చేసి నైపుణ్య శిక్షణను ఇస్తోంది. గ్రామీణ ప్రాంత మహిళలు దీన్ని సద్వినియోగించుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాలోని 23 మండలాల్లో మొత్తం 783 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో సుమారు 43 వేల 245 మంది విద్యార్థులు ఉన్నారు. వారి కోసం 721 మహిళా సంఘాల సభ్యులతో ఏకరూప దుస్తులు కుట్టిస్తున్నారు. గతంలో యూనిఫామ్‌లు ప్రైవేటు సంస్థలతో కుట్టించేవారు. ప్రభుత్వ నిర్ణయంతో ఈసారి మహిళా సంఘాలకు దక్కింది. ఇప్పటి వరకు 74 శాతం దుస్తులు సిద్ధం కాగా, మిగిలినవి నిర్దేశించిన గడువులోగా అందించేలా కృషి చేస్తున్నారు.
స్వశక్తి కేంద్రాల ద్వారా మహిళలకు భరోసా : గ్రామీణ ప్రాంత మహిళలకు ఇది మంచి అవకాశమని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ యూనిఫామ్స్‌తో పాటు ఇతర పనులు సైతం కల్పించాలని కోరుతున్నారు. కుట్టుతో పాటు మరిన్ని శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే విధంగా కృషి చేయాలని అంటున్నారు. మహిళా స్వశక్తి కుట్టు కేంద్రాల ద్వారా అతివలకు ఆర్థిక భరోసా లభిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఒక్కొక్కరు రోజుకు 7 జతలు కుడుతున్నారు.
"ఇంతకు ముందుకు మేము కూలీకి వెళ్లేవాళ్లం. ఇప్పుడు యూనిఫామ్స్ కుట్టడంతో రోజుకు రూ.400 నుంచి రూ.500 సంపాదించుకుంటున్నాం. దీంతో మాకు ఉపాధి అవకాశం వచ్చింది. ఇదొక్కటే కాకుండా ఇలాంటి ఇంకేమైనా అవకాశాలు గ్రామీణ మహిళలకు, సంఘాలకు ఇస్తే అభివృద్ది జరుగుతుంది. యూనిఫామ్స్ కుట్టడం వల్ల మేము కొంచెం నేర్చుకున్నాం. మాకు కుట్టడానికి రాకపోయినా నేర్చుకుని మేము ఈ పని చేస్తున్నాం. ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటున్నాం." - మహిళలు
ఇంకా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ తెలిపారు. మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. కుట్టు కేంద్రాలతో పాటు మరిన్ని ఇతర అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది.
స్కూల్ యూనిఫామ్‌లో టీచర్.. పిల్లల్లో కలిసిపోయి, ఆటపాటలతో పాఠాలు
'ప్రైవేట్ పాఠశాలల్లో బుక్స్, యూనిఫామ్స్ విక్రయిస్తే కఠిన చర్యలు'