Telangana Govt New Policy For MSME Encourage : తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పరిగణించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకొచ్చింది. ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఈ పాలసీతో స్వస్తి పలకనున్నట్లు బలంగా విశ్వసిస్తోంది. పారిశ్రామికరంగంలో రాష్ట్రాణ్ని అగ్రగామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో, సీఎం రేవంత్‌రెడ్డి మార్గనిర్దేశంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో ఈ విధానాన్ని పరిశ్రమల శాఖ తీర్చిదిద్దింది.
ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు పరిశ్రమ 4.0 పేరిట నూతన పాలసీని తీసుకొచ్చింది. సమ్మిళిత అభివృద్ధి, సమగ్ర ఉపాధి, మెరుగైన ఉత్పాదకత సాధించడానికి ఈ కొత్త విధానం దోహదపడుతుందని ప్రభుత్వం నమ్ముతోంది. దీన్ని బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరవుతారు.
కొత్త పాలసీలోని కొన్ని కీలకాంశాలు : ఇప్పటివరకు పారిశ్రామికవాడల్లో ఎంఎస్‌ఎంఈలకు స్థలాలను కేటాయిస్తే, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆయా స్థలాలను గవర్నమెంట్ నుంచి కొనాల్సి వచ్చేది. ఫలితంగా స్థాపించాలనుకున్న పరిశ్రమ పెట్టుబడిలో అత్యధికం, కొన్నిసార్లు మొత్తంగా స్థలం కొనుగోలు చేయటానికే సరిపోయేది. దాంతో పరిశ్రమ ఏర్పాటుకు అప్పులు చేయాల్సి వచ్చేది. ఈ కారణంగా పెట్టుబడి రెట్టింపు కంటే అధికమై, ఇండస్ట్రీ నిర్వహణ కూడా కష్టంగా మారుతోంది.
క్రమక్రమంగా ఎంఎస్‌ఎంఈలు కునారిల్లుతున్నాయి. దీనికి చెక్ పెడుతూ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానంలో లీజు పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇకపై చిన్నతరహా పరిశ్రమలు స్థాపించాలనుకున్న వారు స్థలాన్ని కొనాల్సిన అవసరం ఉండదు. ఏకంగా 33 ఏళ్ల వరకు లీజుకు తీసుకోవచ్చు. అప్పుడు నిర్దేశించుకున్న ప్లాన్ ప్రకారమే, పరిశ్రమ స్థాపనకు పెట్టుబడి పెట్టడానికి మార్గం సుగమవుతుంది. పారిశ్రామికవేత్తలపై ఆర్థిక భారం సైతం తగ్గుతుంది.
- ఎంఎస్‌ఎంఈలను స్థాపించే ఔత్సాహికులకు పక్కా భవనాలను కూడా లీజు పద్ధతిలో ఇవ్వాలని కొత్త పాలసీలో రూపొందించారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) ఈ భవనాలను పరిశ్రమలకు అనువుగా నిర్మిస్తారు.
- లీజు తీసుకున్న తర్వాత నిర్దేశిత సమయంలోగా పరిశ్రమను ప్రారంభించకుంటే ప్రభుత్వం లీజుకిచ్చిన భూమిని, భవనాలను వెనక్కి తీసుకుంటుంది.
- ఎంఎస్‌ఎంఈ పార్క్‌లో సామాజిక సౌకర్యాలు సైతం కల్పించనున్నారు. వాటిలో ప్రైమరీ హెల్త్ సెంటర్, చిన్న పిల్లల సంరక్షణ కేంద్రం, కార్మికుల నివాసానికి గదులు తదితరాలు ఉంటాయి.
- ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో, ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఒక మహిళా పారిశ్రామికవాడను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఎంఎస్‌ఎంఈలను స్థాపించడానికి వచ్చే మహిళలకు మహిళా శక్తి స్కీం ద్వారా మరింత ప్రోత్సహిస్తారు.
రూ.3,736 కోట్ల బకాయిల విడుదలపై దృష్టి : ఈ ఏడాది మే 20వ తేదీ నాటికి రాష్ట్రంలోని పరిశ్రమలకు ప్రోత్సాహకాల కింద ఇవ్వాల్సిన బకాయిల మొత్తం రూ.3,736 కోట్లకు చేరాయి. వీటిలో అధిక మొత్తంలో (రూ.3008 కోట్లు) ఎంఎస్‌ఎంఈలకు, రూ.728 కోట్లు భారీ, మెగా పరిశ్రమలకు సంబంధించినవి. గత ఏడాది అప్పటి ప్రభుత్వం పరిశ్రమల రాయితీలు, ప్రోత్సాహకాల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించినా, వాటిని రిలీజ్ చేయకపోవడంతోనే ఈ సమస్య తలెత్తినట్లు పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. ఈ బకాయిల చెల్లింపుపైనా ప్రస్తుత గవర్నమెంట్ దృష్టిపెట్టింది.